
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు..
స్టాలిన్‌ను కలిసిన మహిళా నేత ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న పరిణామాలపై సీఎం ఏమన్నారు?
ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ద్రవిడ మున్నెట్ర కజగం (DMK) నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలోకి దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (DMDK) అధికారికంగా చేరింది. DMDK ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, ఇతర సీనియర్ నేతలు, ఆఫీస్ బేరర్లతో కలిసి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను స్వయంగా కలిశారు. ఇదే సమావేశంలో సీట్ల పంపకాలపై కూడా ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎం.కె. స్టాలిన్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “DMDK ఈరోజు లౌకిక ప్రగతిశీల కూటమిలో చేరడం ఆనందంగా ఉంది. ప్రేమలత విజయకాంత్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుంది. నలుపు-ఎరుపు జెండాల ఐక్యత తమిళనాడు అభివృద్ధికి తోడ్పడుతుంది. రాష్ట్రాన్ని ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు.
DMDK గత కొంతకాలంగా ఏ కూటమిలో చేరుతుందనే విషయంలో మౌనంగా ఉంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని డీఎండికె భావించినట్లు సమాచారం. చర్చలలో తమ స్థాయిని పెంచుకోవడానికి చివరి వరకు నిరీక్షణ వ్యూహాన్ని అనుసరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీట్ల పంపకాల విషయంలో DMDK 20 అసెంబ్లీ స్థానాలు కోరినట్లు సమాచారం. పార్టీ గుర్తింపు కొనసాగాలంటే కనీసం 6 శాతం ఓట్లు సాధించడం, కనీసం ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధించడం అవసరమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండంకెల సీట్ల కేటాయింపుపై పార్టీ అంతర్గత తీవ్ర చర్చ జరిగింది. కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకులు కూడా కనీసం 10కు పైగా స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
చివరకు డీఎంకేతో..
అయితే డీఎంకెతో పాటు అన్నాడీఎంకే వర్గాల నుంచి రాజ్యసభ సీటుతో కలిపి ఏడు అసెంబ్లీ స్థానాల ఆఫర్ వచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆఫర్‌పై డీఎండికె లోపల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, చివరికి డీఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరడానికే నాయకత్వం మొగ్గుచూపింది.
ఇటీవల ప్రేమలత విజయకాంత్ ఈషా యోగా సెంటర్‌లో బీజేపీ నేతలు ఎస్పీ వెలుమని, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలోకి డీఎండికె వెళ్తుందనే ప్రచారం కూడా సాగింది. అయితే చివరికి డీఎండికె డీఎంకె కూటమిని ఎంచుకోవడం గమనార్హం.
2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ద్రవిడ పార్టీలు తమ పొత్తులను క్రమబద్ధీకరిస్తున్నాయి. ఒకవైపు డీఎంకె ఇప్పటికే తన మిత్రపక్షాలతో చర్చలు ముగించే దశలో ఉండగా, మరోవైపు అన్నాడీఎంకే కూడా తన కూటమిని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డీఎండికె తీసుకున్న నిర్ణయం ఎన్నికల పోరులో కీలక మలుపుగా మారింది.
రాబోయే రోజుల్లో సీట్ల పంపకాలపై స్పష్టత రానుండగా, ఈ కూటమి ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

