
ఆర్.ఎన్. రవి బెంగాల్‌కు బదిలీ ఎలాంటిది?
రాజ్యాంగ సంప్రదాయాలను ఉల్లంఘించిందా?
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని తన రాష్ట్రానికి బదిలీ చేయడానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో సంప్రదించలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆమె దీన్ని ఒక స్థిరమైన రాజ్యాంగ సంప్రదాయాన్ని ఉల్లంఘించిన చర్యగా అభివర్ణించారు.
ఆమె మాటల్లో “ఈ విషయంలో ఆయన నాతో సంప్రదించలేదు. ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తాయి. మన సమాఖ్య వ్యవస్థ పునాదులను బలహీనపరుస్తాయి.”
ఈ వివాదం ఒక ముఖ్యమైన రాజ్యాంగ ప్రశ్నను ఉత్పన్నం చేస్తోంది. రాజ్యాంగ సంప్రదాయం ఉల్లంఘించబడితే దానికి పరిష్కారం ఏమిటి? అవసరమైతే కోర్టులు దానిని అమలు చేయగలవా?
రాజ్యాంగ సంప్రదాయం అంటే ఏమిటి?
రాజ్యాంగ సంప్రదాయాల గురించి క్లాసిక్ వివరణను బ్రిటిష్ న్యాయవేత్త ఎ.వి. డైసీ తన ప్రసిద్ధ గ్రంథం లో ఇచ్చారు. ఆయన ప్రకారం “రాజ్యాంగ చట్టం” “రాజ్యాంగ సంప్రదాయాలు” మధ్య స్పష్టమైన తేడా ఉంది.
రాజ్యాంగ చట్టం కోర్టులు అమలు చేయగలిగిన నియమాలను చెబుతోంది. అయితే రాజ్యాంగ సంప్రదాయాలు ప్రభుత్వ వ్యవస్థను నడిపే ఆచారాలు అంగీకరించిన విధానాలు అయినప్పటికీ, సాధారణంగా కోర్టుల ద్వారా అమలు చేయబడవు.
తరువాత న్యాయవేత్త ఐవర్ జెన్నింగ్స్ ఈ భావనను మరింత అభివృద్ధి చేశారు. ఆయన ఒక సంప్రదాయం ఉందని నిర్ధారించడానికి మూడు ప్రశ్నలను సూచించారు. ఆ ఆచరణకు మునుపు ఉదాహరణ ఉందా? సంబంధిత అధికారులు దాన్ని ఒక నియమంగా భావించారా?
ఆ నియమానికి సరైన కారణం ఉందా?
జెన్నింగ్స్ ఒక కీలక విషయం కూడా చెప్పారు. సరైన కారణం ఉంటే ఒకే ఒక్క ఉదాహరణ కూడా ఒక సంప్రదాయాన్ని స్థాపించడానికి సరిపోవచ్చు. కానీ కారణం లేకుండా ఉన్న అనేక ఉదాహరణలు కూడా అంత ఉపయోగం ఉండవు.
బంధనంగా మారిన సంప్రదాయం మమతా బెనర్జీ పేర్కొన్న సంప్రదాయం ఏమిటంటే: ఒక రాష్ట్రానికి గవర్నర్‌ను నియమించడానికి లేదా బదిలీ చేయడానికి ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఎందుకంటే గతంలో గవర్నర్ నియామకాల ముందు ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ నియమానికి ఉన్న కారణం కూడా చాలా ముఖ్యమైనది.
గవర్నర్ నియామకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఎంపిక చేసిన వ్యక్తిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుంది.
ఈ సంప్రదాయానికి మద్దతుగా గత నాలుగు దశాబ్దాల్లో ఏర్పడిన పలు కమిషన్లు కూడా ఇదే సిఫార్సు చేశాయి. 1988లో సర్కారియా కమిషన్, 2002లో వెంకటచలయ్య కమిషన్, 2010లో పుంఛీ కమిషన్, 2026 ఫిబ్రవరిలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన కురియన్ జోసెఫ్ కమిటీ ఈ కమిషన్లు గవర్నర్ నియామకానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని సూచించాయి.
సంప్రదాయం నుంచి చట్టం వరకు: రాజ్యాంగాల్లో తరచుగా కొన్ని ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలను పూరించడానికి సంప్రదాయాలు ఉపయోగపడతాయి. 1993లో జరిగిన సెకండ్ జడ్జెస్ కేసులో జస్టిస్ కుల్దీప్ సింగ్ ఈ విషయాన్ని వివరించారు. ఆయన ప్రకారం సంప్రదాయాలు రాజ్యాంగంలోని ఖాళీలను పూరిస్తాయి, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి . భవిష్యత్తులో రాజ్యాంగ వ్యవస్థ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తాయి. అదే తీర్పులో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పారు.
ఒకసారి ఒక సంప్రదాయం స్థిరంగా ఏర్పడి రాజ్యాంగ అధికారులచే అనుసరించబడితే, దానిని చట్ట స్థాయికి తక్కువగా చూడడానికి కారణం ఉండదు. సుప్రీంకోర్టు తరువాతి కేసుల్లో కూడా సంప్రదాయాలను బలపరిచింది. 2015లో జరిగిన ఎన్.జె.ఏ.సి. కేసులో, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను కోర్టు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగంగా గుర్తించింది.
న్యాయ పరిష్కారం ఉందా?
ప్రస్తుత రాజ్యాంగ న్యాయశాస్త్రం ప్రకారం, ముఖ్యమంత్రిని సంప్రదించకుండా గవర్నర్ బదిలీ చేయడాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మూడు ప్రధాన వాదనలు చేయవచ్చు.
మొదటిది, ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన సంప్రదాయం ఇప్పుడు చట్ట స్థాయికి చేరిందని వాదించవచ్చు. రెండవది, సంప్రదాయాన్ని పాటించకుండా తీసుకున్న నిర్ణయం భారత సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పవచ్చు.
ఎందుకంటే సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. మూడవది, గవర్నర్ పదవి అధ్యక్షుడి ఇష్టానుసారం కొనసాగుతుందని చెప్పే ది” కూడా పూర్తిగా స్వేచ్ఛా అధికారంగా ఉపయోగించలేమని సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొంది. సరైన కారణం లేకుండా తీసుకునే నిర్ణయాలు కోర్టు పరిశీలనకు లోబడి ఉంటాయి. అయితే ఈ వాదనలను కోర్టు అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు.
కొనసాగుతున్న అసమానత
రాజ్యాంగ సంప్రదాయాలను అమలు చేయడంలో ఒక నిర్మాణాత్మక అసమానత ఉంది. ఒక సంస్థకు ఆ సంప్రదాయాన్ని అమలు చేయడానికి శక్తి ఉంటే, ఆ సంప్రదాయం చట్టంగా మారడం సులభం అవుతుంది.
ఉదాహరణకు, న్యాయమూర్తుల నియామక వ్యవస్థలో సుప్రీంకోర్టు తానే ఆ ప్రక్రియలో భాగమై ఉండటం వల్ల కొలీజియం సంప్రదాయం బలపడింది. కానీ గవర్నర్ నియామకాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై కలిగిన రాజకీయ ప్రభావానికి సంబంధించిన విషయం. దీనిని నియంత్రించడానికి సమాన శక్తి కలిగిన సంస్థ స్పష్టంగా లేదు. గత నలభై సంవత్సరాల్లో నాలుగు కమిషన్లు ఈ వ్యవస్థను చట్టబద్ధం చేయాలని సూచించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు.
ఆఖరుప్రశ్న
ఆర్.ఎన్. రవి బదిలీ కేవలం మమతా బెనర్జీకి రాజకీయ ఇబ్బంది మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ .ఒక ముఖ్యమైన పరీక్షను ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన సంప్రదాయం నిజంగా చట్టబద్ధమైన నియమమా? మరియు అవసరమైతే కోర్టులు దాన్ని అమలు చేయగలవా?
చివరికి ఈ ప్రశ్నకు సమాధానం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది: ఈ విషయాన్ని కోర్టులో సవాచేయాలనే రాజకీయ సంకల్పం, ఆ సవాలుపై నిర్ణయం తీసుకునే న్యాయవ్యవస్థ అంగీకారం.
Next Story

