పొలిటికల్ మార్కెటింగా, క్రెడిట్ చోరీకా, దావోస్ ఎందుకెళ్లారయ్యా!
x

'పొలిటికల్ మార్కెటింగా, క్రెడిట్ చోరీకా, దావోస్ ఎందుకెళ్లారయ్యా!'

చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి విమర్శల పర్వం


అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం మానేసి రాజకీయ విమర్శలు చేయడాన్ని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తీవ్రంగా తప్పుబట్టారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, దావోస్ వేదికను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు పొలిటికల్ మార్కెటింగ్‌కు వేదికగా మార్చారని మండిపడ్డారు.
వైయస్‌.జగన్ హయాంలో కుదిరిన పరిశ్రమల ఒప్పందాలకు ఇప్పుడు శంకుస్థాపనలు చేసి, వాటి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది తండ్రీ–కొడుకుల క్రెడిట్ చోరీకి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. బ్రాండ్ ఇమేజ్ పేరుతో దావోస్‌కు వెళ్లినా, ప్రజలకు మాత్రం అది బ్యాండ్ మేళం లాంటి ప్రదర్శనగా కనిపించిందని విమర్శించారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌, భోగాపురం విమానాశ్రయం వంటి వాటిని తామే నిర్మించినట్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్నా ఒక్క కొత్త పరిశ్రమైనా తీసుకొచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్‌లకు అధికార పార్టీ నేతలే నిర్వాహకులుగా వ్యవహరించడం దారుణమని అమర్నాధ్ వ్యాఖ్యానించారు. మహిళల గౌరవం, సంస్కృతి గురించి మాట్లాడే ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడనడం పచ్చి అబద్ధమని, చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి కష్టాలు వస్తాయని స్పష్టం చేశారు.
తనపై మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని ఖండించిన అమర్నాధ్, దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనలో విఫలమై ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం, అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, రోగులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చివరిగా, ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, 2029లో దీనికి తగిన సమాధానం చెప్పడం ఖాయమని అమర్నాధ్ హెచ్చరించారు.
Read More
Next Story