Tammineeni Veera Bhadram
x
సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం

సీపీఎంలో సంచలనం: తమ్మినేని వీరభద్రం రాజీనామా, ఎందుకంటే?

ఎర్రజెండా నీడలో ముఠా తగాదాలు: తమ్మినేనికి అభిశంసన. పార్టీకి వీరభద్రం గుడ్ బై?


తెలంగాణ సీపీఎంలో బలమైన నేతగా ఉన్న తమ్మినేని వీరభద్రం పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ కేంద్ర కమిటీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ‘అభిశంసన’ (Censure) చేసిన నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఈ విషయమై ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదు.
రాజీనామా వార్తల వెనుక కారణాలు?
ఇటీవల తిరువనంతపురంలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం తెలంగాణ పార్టీపై ఒక ‘చార్జిషీట్’ లాంటి లేఖను విడుదల చేసింది. (ఈ అభిశంసన తర్వాత తమ్మినేని వీరభద్రం సీపీఎం కి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ను ఫోన్ లో సంప్రదించేందుకు ది ఫెడరల్ ప్రతినిధి ప్రయత్నించినా ఆయన ఫోన్ ఎత్తలేదు.)

ఫిబ్రవరి 7న సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పేరిట తెలంగాణ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను అభిశంసిస్తూ రాసిన లేఖ యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం..
ప్రియమైన కామ్రేడ్,
కేరళలోని తిరువనంతపురంలో 2026 జనవరి 16 నుండి 18 వరకు జరిగిన సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన లేఖను పంపిస్తున్నాం. ఈ లేఖను శాఖ స్థాయి వరకు వివరించాలి.
అభినందనలతో,
(ఎం.ఎ. బేబీ),
ప్రధాన కార్యదర్శి
.......
దేశంలోని పార్టీ శాఖల్లో ఒక ముఖ్యమైనది తెలంగాణా శాఖ. బిజెపి-ఆరెస్సెస్ హిందూత్వ మతోన్మాద శక్తులను ఒంటరి పాలు చేసి, ఓడించడం, పార్టీ, వర్గ, ప్రజాసంఘాల స్వతంత్ర రాజకీయ, సంస్థాగత బలాన్ని పెంపొందించడం అనే పార్టీ 24వ మహాసభ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ శాఖ గుర్తించదగిన పాత్ర వహించాల్సి ఉంది. కాని గత కొన్నేళ్ళుగా తెలంగాణా శాఖను తీవ్రమైన రాజకీయ, నిర్మాణ సమస్యలు ఆవరించి ఉన్నాయి. వాటిని సరిదిద్దేందుకు పదే పదే ప్రయత్నించినప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి.
జనవరి 2025లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఇవి తారాస్థాయికి చేరాయి. అవి పార్టీ ఆలిండియా మహాసభలో కూడా ప్రతిబింబించాయి. కొన్ని జిల్లా పార్టీ మహాసభల్లో సైతం తీవ్రమైన పెడ ధోరణులు వ్యక్తమయ్యాయని రిపోర్టు వచ్చింది. ఈ సమస్యలను చేపట్టి, తప్పుడు ధోరణులను సరిచేసి, నిర్మాణానికి పదునుపెడితే తప్ప, పార్టీ ముందున్న కర్తవ్యాలను సమర్ధవంతంగా నెరవేర్చలేం. పార్టీ, ప్రజాసంఘాల బలోపేతం కూడ సాధ్యం కాదు. ఈ సమస్యల తీవ్రత దృష్ట్యా తెలంగాణ పార్టీకి ఈ లేఖ రాయాలని కేంద్రకమిటీ భావించింది.
తెలంగాణ పార్టీలోని పొరపాటు ధోరణులు, అభిప్రాయాలను, నిర్మాణ లోపాలను స్పష్టం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాం. పార్టీ 24వ ఆలిండియా మహాసభ తన నిర్మాణ నివేదికలో ఇలా పేర్కొంది.
"తెలంగాణ పార్టీ రాష్ట్ర మహాసభలో కొన్ని అనారోగ్యకర ధోరణులు గుర్తించాం. పార్టీ ఆలిండియా మహాసభ అనంతరం ఈ సమస్యను చేపట్టడం జరుగుతుంది." ఈ ఆదేశానికి కొనసాగింపుగా, పార్టీ రాష్ట్ర మహాసభల తీరును సమీక్షించడానికి రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్రకమిటీ సమావేశాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎ విజయ రాఘవన్, బివి రాఘవులు సమక్షంలో మే 14-16 తేదీల్లో జరిగాయి. దీని గురించి, జూన్లో జరిగిన కేంద్రకమిటీకి సమర్పించిన పిబి (పాలిట్ బ్యూరో) వర్క్ రిపోర్టులో ఇలా ఉంది...
“పార్టీ నిర్మాణంలో కొనసాగుతున్న అనారోగ్యకర వాతావరణాన్ని ఈ చర్చలు వెల్లడించాయి. పార్టీ మహాసభ నిర్ణయించిన విధంగా, పొలిట్ బ్యూరో ఈ సమస్యలను చేపట్టి, పార్టీలో ఐక్యతను పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.” దానికి అనుగుణంగా, ఈ సమస్యలపై రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాలను అర్ధం చేసుకోవడానికి, మరొ దఫా సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ప్రధాన కార్యదర్శి ఎం ఏ బేబి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎ విజయ రాఘవన్, శ్రీదీప్ భట్టాచార్య, బివి రాఘవులును పార్టీ నియమించింది. వారి నివేదిక ఆధారంగా, 2025 అగస్టు 18న జరిగిన పిబి సమావేశం, తెలంగాణ పార్టీలోని అనారోగ్యకర వాతావరణంపై దర్యాప్తు జరిపేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీదీప్ భట్టాచార్య, కె బాలకృష్ణన్లతో ఒక ద్విసభ్య కమిషన్ను పంపించాలని నిర్ణయించింది.
ద్విసభ్య కమిషన్ లోతైన పరిశీలన తర్వాత తన నివేదికను సమర్పించింది. తీవ్రస్థాయిలో జరిగిన ఉల్లంఘనలకు ఆనాటి రాష్ట్ర కార్యదర్శి ప్రధానంగా బాధ్యుడని కమిషన్ నిర్ధారించింది. మరో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా తప్పు చేశారని తేల్చింది. కేంద్రకమిటీ సభ్యుడు టి. వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు సెలాబ్ బాబు, బి. ప్రసాద్‌లు ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మ విమర్శ లోపించిందని భావించిన కేంద్ర కమిటీ, నిర్మాణానికి సంబంధించి తగని విధంగా ప్రవర్తించిన ఈ కామ్రేడ్స్‌పై క్రమశిక్షణా చర్య తీసుకున్నది. ఈ ముగ్గురు కామ్రేడ్స్‌ను అభిశంసించింది.
కామ్రేడ్ వీరభద్రాన్ని రాష్ట్ర సెక్రటేరియట్, కమిటీ సమావేశాలలో పరిశీలకునిగా నడుచుకోవాలని, రాష్ట్ర సెక్రటేరియట్ డైరక్షన్లో పనిచేయాలని కేంద్ర కమిటీ ఆదేశించింది. తీవ్రమైన నిర్మాణ అనైక్యత పార్టీ గత రాష్ట్ర మహాసభ సమయంలో అనేక అభ్యంతరకరమైన, అనంగీకారమైన ధోరణులు, ప్రత్యేకించి నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకునేప్పుడు అత్యంత తీవ్రమైన రూపంలో కనిపించాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు. ప్రజాతంత్రయుతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్ళు చోటుచేసుకున్నాయి. అటువంటి ప్రవర్తనకు సీనియర్ నాయకులే పాల్పడటం పార్టీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమైంది. ముఠాతత్వం, ప్రమాణాల ఉల్లంఘన నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ సమయంలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరింది. ఐక్యత కోసం పొలిట్ బ్యూరో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి రాష్ట్ర కార్యదర్శితో సహా ఒక సెక్షన్ మొండిగా వ్యవహరించింది. ఇది పార్టీ సమిష్టి ప్రయోజనాల కన్నా ఒక ముఠా ప్రయోజనాలను పైకి తెచ్చే ప్రయత్నంగా వెల్లడైంది. అస్తిత్వవాద రాజకీయాల ప్రభావం రాష్ట్ర మహాసభ కాలంలో కుల ప్రాతిపదికన చర్చలకు, ప్రచారానికి దారితీసింది.
ఒక విప్లవాత్మక, కార్మికవర్గ పార్టీలో ఇవి సహించరానివి. బహిరంగ కులతత్వం, వర్గ దృష్టితో పనిచేసే విప్లవ సంస్థ సిద్ధాంతాలతో పొసగనివి. తప్పుడు రాజకీయ దృక్పథం- ఫెడరల్ ధోరణులు తెలంగాణ పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తున్న రాజకీయ విధానం, పార్టీ ఎత్తుగడల విధానానికి భిన్నంగా ఉంది. రాష్ట్ర మహాసభలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి పార్టీ లైన్ పట్ల తన అనంగీకారాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. ఇది ఫెడరల్ ధోరణులను, నిర్మాణ రాహిత్యాన్ని వ్యక్తం చేస్తోంది. తరిగిపోయిన పార్టీ విలువలు నాయకత్వంలోని ఉదారవాద ధోరణి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు, కమ్యూనిస్టు విలువలు దిగజారడానికి, అవినీతికర చర్యలు వ్యాపించడానికి దారితీసింది. ఇది అనైతిక ప్రవర్తనలను, ఆర్థిక అవకతవకలను సహించే వాతావరణాన్ని సృష్టించింది. ఐక్యతను పటిష్టం చేసేందుకు చర్యలు సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పార్టీ ఐక్యతను బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతలను స్వతంత్రంగా నిర్వర్తించాలి. సమష్టి పని విధానాన్ని నెలకొల్పాలి. నిర్ణయాలను సమిష్టిగా మాత్రమే తీసుకోవాలి. ముఠా ధోరణితో కూడిన పనివిధానాన్ని అనుమతించరాదు. నిర్మాణ సూత్రాలను, పార్టీ నిబంధనావళిని కచ్చితంగా పాటించాలి. పొలిట్ బ్యూరో మార్గదర్శకత్వంలో తీవ్రమైన దిద్దుబాటు క్రమాన్ని చేపట్టాలి.
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)
Read More
Next Story