అస్సాం అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల..
x

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల..

23 మంది అభ్యర్థుల ప్రకటన – బీజేపీకి సవాల్‌గా ప్రతిపక్ష కూటమి..


Click the Play button to hear this message in audio format

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పోరు వేడెక్కుతోంది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సవాల్ విసురుతూ కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ 23 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది.

ఇప్పటివరకు కాంగ్రెస్ మొత్తం 65 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే తన మిత్రపక్షాల కోసం మరో 15 స్థానాలను కేటాయించింది. 126 సభ్యుల అసెంబ్లీ ఉన్న అస్సాంలో జరిగే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బలోపేతం దిశగా ప్రతిపక్ష కూటమి..

బీజేపీకి ఎదురుగా కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేస్తోంది. ఈ కూటమిలో సీపీఎం, అస్సాం జాతీయ పరిషత్ వంటి పార్టీలు ఉన్నాయి. అదనంగా CPI లిబరేషన్ కూడా ఈ కూటమికి మద్దతు ప్రకటించింది.

గత ఎన్నికల్లో ఈ కూటమిలో భాగమైన రైజోల్ దళ్ ఈసారి కూటమిలో చేరలేదు. ఆ పార్టీ నాయకుడు అఖిల్ గోగోయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుత ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన రెండో జాబితాలో ముగ్గురు ప్రస్తుత ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. వీరిలో వాజెద్ అలీ చౌధురి (బిర్సింగ్ జరువా), అబుల్ కలాం రషీద్ ఆలమ్ (గోలపారా ఈస్ట్), రకీబుద్దిన్ అహ్మద్ (చమారియా) ఉన్నారు.

మాజీ లోక్‌సభ సభ్యుడు అబ్దుల్ ఖాలేఖ్‌ను మండియా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

ఇతర అభ్యర్థుల్లో టింగ్ఖోంగ్ నుంచి బిపుల్ గోగోయ్, రంగాపారా నుంచి కార్తిక్ చంద్ర కుర్మి, న్యూ గువాహటి నుంచి సంతాను బోరా, డిమోరియా నుంచి కిషోర్ కుమార్ బరువా, శ్రిజంగ్రామ్ నుంచి నురుల్ ఇస్లాం, టిన్సుకియా నుంచి దేవిద్ ఫుకాన్ వంటి నేతలకు టికెట్లు ఇచ్చారు.

మిత్రపక్షాలకు కొన్ని స్థానాలు..

కాంగ్రెస్ పార్టీ బజాలి, పలాస్బరి, గువాహటి సెంట్రల్, గోరేస్వర్, మోరిగావ్, బర్హంపూర్, బిందాకండి, బెహాలి, దిబ్రుగఢ్, డిఫు వంటి కొన్ని నియోజకవర్గాలను తన మిత్రపక్షాల కోసం వదిలిపెట్టింది.

డిలిమిటేషన్ తర్వాత మొదటి ఎన్నిక..

2023లో అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) పూర్తయింది. సీట్ల సంఖ్యలో మార్పులు లేకపోయినా, నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించారు. ఈ మార్పుల తర్వాత జరగబోయే ఇది మొదటి అసెంబ్లీ ఎన్నిక కావడం ప్రత్యేకత.

ఇంతకుముందు మార్చి 3న కాంగ్రెస్ పార్టీ 42 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. అందులో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ జోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దెబబత్ర నజిరా నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రిపున్ బోరా బర్చల్లా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

హ్యట్రిక్ దిశగా బీజేపీ..

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి అధికారంలో లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని మిత్రపక్షాల్లో అసోం గణ పరిషత్ (ఏజీపీ)కి 9 మంది, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు ఏడుగురు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)కు ముగ్గురు సభ్యులు ఉన్నారు.

ప్రతిపక్షంలో కాంగ్రెస్‌కు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదనంగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)కు 15 మంది సభ్యులు, సీపీఐ(ఎం)కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నాడు.

ప్రచారంలో పెరిగిన వేడి..

అస్సాం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అస్సాం అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ పాలన ప్రధాన కారణమని విమర్శించారు.

మొత్తంగా చూస్తే అస్సాం అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కఠిన పోరుకు వేదికగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story