
20 ఏళ్ల కిందటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం జాబ్ కార్డు చూపిస్తున్న మహిళ చిత్రాన్ని జైరాం రమేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు
విబీ–జీ రామ్ జీపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్
ఎంజీఎన్ఆర్జీఏకి ఏది సరిపోలదన్న జైరాం రమేష్
గ్రామీణ ఉపాధి హామీ పథకం అయిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) గ్రామాల్లో ఒక కీలకమైన, మార్పు తీసుకొచ్చిన చట్టమని కాంగ్రెస్ పేర్కొంది. దాన్ని భర్తీ చేసిన విబీ–జీ రామ్ జీ (Viksit Bharat Guarantee for Rozgar and Aajeevika Mission – Gramin) చట్టం అనాలోచితంగా ఉందని , ఇది గ్రామీణ కార్మికుల హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ సందర్భం గా మాట్లాడుతూ, సరిగ్గా రెండు దశాబ్దాలక్రితం ఏపీలోని అనంతపురం జిల్లా బడ్నపల్లి గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు గ్రామీణ కుటుంబాలకు కోట్లాది పని దినాలు కల్పించబడ్డాయని, ముఖ్యంగా మహిళలకు ఉపాధి చేకూరిందని చెప్పారు. గ్రామాల్లో కమ్యూనిటీ ఆస్తులు ఏర్పడ్డాయని, వలసలు పూర్తిగా తగ్గాయని, గ్రామ పంచాయతీలు మరింత బలపడ్డాయని తెలిపారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఒక డిమాండ్ ఆధారిత చట్టబద్ధ హామీ అని రమేశ్ స్పష్టం చేశారు. ప్రజలు పని కోరితే తప్పకుండా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండేదని, పనులను గ్రామస్థాయిలోనే గ్రామ సభలు, పంచాయతీలు నిర్ణయించేవని అన్నారు. రాష్ట్రాలు మొత్తం ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే భరిస్తే సరిపోతుందని చెప్పారు.
కానీ కొత్తగా తీసుకొచ్చిన విబీ–జీ రామ్ జీ చట్టం కేంద్రంలో అధికార కేంద్రీకరణకు దారి తీస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇకపై ఏ ప్రాంతాల్లో పని ఉండాలన్నది ఢిల్లీ నుంచే నిర్ణయిస్తారని, పంచాయతీల పాత్ర తగ్గిపోయిందని పేర్కొంది.
బడ్జెట్ కేటాయింపుల ఆధారంగానే పనులు ఉంటాయని, ప్రజల డిమాండ్‌కు ప్రాధాన్యం ఉండదని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది పంటకాలంలో రెండు నెలల పాటు పథకం పూర్తిగా నిలిచిపోతుందని, దీని వల్ల కార్మికుల బేరసార శక్తి తగ్గుతుందని చెప్పింది.
అలాగే, కొత్త చట్టం ప్రకారం ఖర్చుల్లో 40 శాతం రాష్ట్రాలే భరించాల్సి వస్తుందని రమేశ్ తెలిపారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ భారం మోయలేక సతమతమవుతున్నాయని పని కల్పించడం ఆపేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 2025లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విబీ–జీ రామ్ జీ చట్టం, రెండు దశాబ్దాల తర్వాత ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను భర్తీ చేసింది. కాగితాలపై ఉపాధి హామీ రోజులు 100 నుంచి 125కి పెంచినప్పటికీ, అమలు విధానాలు నిధుల పంపిణీలో మార్పులు సమస్యాత్మకంగా మారాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
మొత్తానికి, ఈ కొత్త చట్టం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో ఉన్న హక్కుల ఆధారిత ఉపాధి హామీని బలహీనపరుస్తోందని, గ్రామీణ పేదలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.
Next Story

