రఘురామపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా..అసెంబ్లీ వద్ద టీడీపీ నేత నిరసన
x

రఘురామపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా..అసెంబ్లీ వద్ద టీడీపీ నేత నిరసన

రఘురామ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వెంకటేశ్వర రాజు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా గురువారం ఒక అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా విపక్షాలు నిరసన తెలిపే ఈ వేదికపై, ఈసారి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత తన సొంత పార్టీకే చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఉండి నియోజకవర్గ నాయకుడు వెంకటేశ్వర రాజు, చేతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ఎన్టీఆర్ విగ్రహంతో నిరసన .. పోలీసుల అడ్డగింత
తన నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సాగిస్తున్న వేధింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లేందుకే తాను ఇక్కడికి వచ్చానని వెంకటేశ్వర రాజు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని సాక్షిగా పెట్టుకుని తన గోడు వెళ్లబోసుకోవాలని ఆయన ప్రయత్నించగా, అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆయనకు మధ్య జరిగిన వాగ్వాదం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది.
40 ఏళ్ల విధేయతకు దక్కిన బహుమతి ఇదేనా?
అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర రాజు కన్నీటి పర్యంతమయ్యారు. నేను 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తున్న కార్యకర్తను. పార్టీని నమ్ముకున్నందుకు నాకు ఇచ్చే బహుమతి ఇల్లు కూల్చివేతనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు ఉన్న తన ఇంటిని, తన పార్టీ కార్యాలయాన్ని రఘురామ కృష్ణరాజు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమంగా కూల్చివేయించారని, తనను చంపించేందుకు కూడా
రఘురామ కృష్ణరాజు కుట్రలు పన్నుతున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. రఘురామ చర్యల వల్ల ఉండిలో తెలుగుదేశం పార్టీ నాశనమవుతోందని ఆయన మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు మొర ఆలకించాలి
రఘురామకృష్ణరాజు కేవలం తననే కాకుండా, ఉండి నియోజకవర్గంలో మత సామరస్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారని, చర్చిలు, మసీదులను కూడా కూల్చివేస్తున్నారని వెంకటేశ్వర రాజు సంచలన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తండ్రి సమానులని, వెంటనే స్పందించి నాకు న్యాయం చేయాలి. పార్టీని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్న రఘురామను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. రఘురామ కృష్ణరాజుపై సొంత పార్టీ నేతలే ఈ స్థాయిలో రోడ్డు ఎక్కడం ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాక్షాత్తు అసెంబ్లీ వద్ద రఘురామ కృష్ణరాజుపై టీడీపీ నేత వెంకటేశ్వర రాజు చేసిన ఆరోపణలు తాజాగా టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. వీటిపైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story