
‘కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది..అధికారంలో భాగస్వామ్యం ఉండదు.’
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు.
“అధికారాన్ని పంచుకోవడం తమిళనాడుకు సరిపోదు. కాంగ్రెస్‌కూ అది తెలుసు” అని స్టాలిన్ అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కూటమిలో చీలిక తేవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకు అధికార భాగస్వామ్య అంశాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు. ఆ వ్యూహం పనిచేయదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని స్టాలిన్ చెప్పారు. “రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ను సోదరుడిగా చూస్తాను. ఆయన కూడా నన్ను అలాగే చూస్తారు” అని పేర్కొన్నారు. డీఎంకే–కాంగ్రెస్ కూటమి సామరస్యంగా కొనసాగుతోందని, ఇతరులు ఆశిస్తున్న విభేదాలు రావన్నారు.
రాబోయే ఎన్నికలు 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే కష్టంగా ఉండవని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలను కేంద్రం కూడా అనుసరిస్తోందన్నారు. ఇందులో భాగంగా ‘తోజి హాస్టల్స్’ పథకాన్ని ప్రస్తావించారు. నగరాలకు ఉద్యోగం కోసం వలస వెళ్తున్న మహిళలకు సురక్షిత, తక్కువ ఖర్చుతో వసతి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. సంక్షేమ–మహిళా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ హాస్టళ్లు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నాయి.

