కేరళ ఎన్నికలు: పినరయి విజయన్, రాహుల్ మధ్య మాటల యుద్ధం
x

కేరళ ఎన్నికలు: పినరయి విజయన్, రాహుల్ మధ్య మాటల యుద్ధం

ఏప్రిల్ 9న పోలింగ్..మే 4న ఫలితాలు..


Click the Play button to hear this message in audio format

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు రాజకీయ పరిజ్ఞానం తక్కువగా ఉందని విమర్శించారు. జాతీయ నాయకుడైనప్పటికీ, ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తకు ఉండే ప్రాథమిక అవగాహన కూడా ఆయనకు లేదన్నారు.

పినరయి విజయన్ ఎర్నాకుళంలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని, పదే పదే అవే తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని బీజేపీకి “బి-టీమ్”గా అభివర్ణించిన విజయన్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైఖరి బీజేపీకి సహకరించేలా ఉందని వ్యాఖ్యానించారు.

ఇటు, రాహుల్ కూడా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళలో ఎల్‌డీఎఫ్, బీజేపీ మధ్య రహస్య భాగస్వామ్యం ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రజలను విభజిస్తున్నాయని అన్నారు.


మాట తప్పిన విజయన్..

కోజికోడ్‌లో యూడీఎఫ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. రాష్ట్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా, ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. పదేళ్లు గడిచినా కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోయారని పేర్కొన్నారు.


హామీల అమలేది?

కేరళలో అసలు ఎన్నికల పోరు యూడీఎఫ్, బీజేపీ-ఎల్‌డీఎఫ్ మధ్య జరుగుతోందన్నారు. యూడీఎఫ్ ప్రజలను ఏకం చేస్తుందని, ఎల్‌డీఎఫ్ మాత్రం ప్రజలను విభజిస్తోందని అన్నారు.

అలాగే, కేంద్రంలో ప్రధాని ఇచ్చిన ఉద్యోగ హామీలు కూడా అమలు కాలేదని ప్రస్తావించారు. ప్రజలకు జవాబుదారీతనం ఈ ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే విడతలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 23తో ముగియనుంది.

Read More
Next Story