చంద్రబాబు రెండేళ్ల పాలనలో 3.2 లక్షల కోట్ల అప్పు
x

చంద్రబాబు రెండేళ్ల పాలనలో 3.2 లక్షల కోట్ల అప్పు

గణాంకాలతో విరుచుకుపడ్డ వైఎస్ జగన్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ.. బడ్జెట్ లెక్కల నుంచి క్షేత్రస్థాయి దోపిడీ వరకు ప్రతి అంశాన్ని ఎండగట్టారు.

ఆర్థిక విధ్వంసం - కాగ్ రిపోర్టు సాక్షిగా

రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అప్పులు అమాంతం పెరిగాయని జగన్ ఆరోపించారు. 2023-24లో రాబడులు రూ.1.70 లక్షల కోట్లు ఉంటే, చంద్రబాబు వచ్చాక అవి రూ.1.68 లక్షల కోట్లకు పడిపోయాయని, కానీ ఖర్చులు మాత్రం రూ.2.49 లక్షల కోట్లకు పెంచారని వివరించారు. తమ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు అయితే, చంద్రబాబు కేవలం రెండేళ్లలోనే రూ.3.2 లక్షల కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు. బడ్జెట్ అప్పులు రూ.60,485 కోట్లని ప్రభుత్వం చెబుతుంటే, కాగ్ మాత్రం రూ.81,071 కోట్లుగా తేల్చిందని.. అంటే రూ.20 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం దాచిపెట్టిందని జగన్ విమర్శించారు.

సూపర్ సిక్స్‌కు పంగనామాలు - సంక్షేమం సున్నా

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు వెన్నుపోటు'పొడుస్తున్నారని జగన్ విమర్శించారు. ఒక్క నెలలోనే 25 వేల పెన్షన్లను కట్ చేశారని, బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని కోతలు తప్పవని హెచ్చరించారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.6,428 కోట్లు ఉన్నా బడ్జెట్‌లో నామమాత్రపు నిధులే కేటాయించారని.. నాడు-నేడును గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, గిట్టుబాటు ధర లేక మిర్చి, మొక్కజొన్న రైతులు విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు.

వైజాగ్‌లో రూ.5 వేల కోట్ల భూదోపిడీ

రాష్ట్రంలో విచ్చలవిడి దోపిడీ సాగుతోందని జగన్ ఆరోపించారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు, లోక్‌సభ ఎంపీ కలిసి ఆక్రమిస్తున్నారని, అక్కడ ఉన్న ప్రభుత్వ బోర్డులను పీకేసి పొక్లెయిన్లతో లెవల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మట్టి, భూములు, లిక్కర్.. ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

టీటీడీ అపచారాలు - తిరుమల బంగారం చోరీ

తిరుమల పవిత్రతను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీస్తోందని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2025 జనవరిలో పరకామణిలో కోటి రూపాయల విలువైన బంగారం చోరీ జరిగితే, దొంగకు బెయిల్ ఇప్పించి కేసును నీరుగార్చారని ఆరోపించారు. నెయ్యి ధరను కేజీ రూ.351 నుంచి రూ.716కు పెంచి రూ.200 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారాలు చేశారని విమర్శించారు.

డైవర్షన్ పాలిటిక్స్ - పిల్లల కనే అంశంపై చలోక్తులు

చదువు, వైద్యం, ఉద్యోగం ఇవ్వలేని చంద్రబాబు.. ఇప్పుడు పిల్లల్ని కనమని చెబుతున్నాడు. పెళ్లి కానుక ఇవ్వడు కానీ, ముగ్గురు పిల్లల్ని కంటే డబ్బులిస్తాడంట.. ఇది ప్రజలను మోసం చేసే డైవర్షన్ పాలిటిక్స్ కాదా? అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలపై అశ్లీల వీడియో కాల్స్, వేధింపులకు పాల్పడుతున్నా వారిపై చర్యలు తీసుకోని చంద్రబాబు.. మహిళా రక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Read More
Next Story