
2021 నవంబర్ 19న చంద్రబాబు కంటనీరు పెట్టిన దృశ్యం (పైల్ ఫోటో)
చంద్రబాబు భార్యను తిట్టమన్నదే జగన్- పవన్ కల్యాణ్
ఆనాటి సంఘటనను పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు గుర్తు చేశారు?
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయమని ప్రోత్సహించిందే జగన్ అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయని.. వాటిపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని సూచించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, వారి భార్యల గురించి ఇటీవల ఓ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఏప్రిల్ 7న ధర్నా, బైఠాయింపు జరిపారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధిపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అనుకూల, ప్రతికూల ఖండన మండనలు వచ్చాయి.
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. గతంలో జగన్ సీఎం హోదాలో పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడు మాటలు మాట్లాడారని పవన్ గుర్తు చేశారు. భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ తీరును ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడితే జగన్ నవ్వుతూ ప్రోత్సహించారని గుర్తు చేశారు. అదే విధంగా తనపైన, తన వ్యక్తిగత విషయాలపైన వైసీపీ నేతలు చెలరేగి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ అప్పట్లో జగన్ కార్యాలయాలపైన గాని, ఆయన సంస్థలపైగానీ టీడీపీ, జనసేన అభిమానులెవరూ దాడి చేయలేదన్నారు. ఎదుటివారు దిగజారి మాట్లాడినా, మనం వారి స్థాయికి దిగజారవద్దని.. ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఈ రోజుకీ దిగజారి, అభ్యంతరకర భాషలోనే మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు సతీమణిని వాళ్లు ఏమన్నారంటే..
2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆవేదనతో చంద్రబాబు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సభలోనే కన్నీరుమున్నీరై, భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా తప్ప సభలో అడుగుపెట్టనని శపథం చేసి బయటకు వచ్చారు.
అసెంబ్లీలో వ్యవసాయంపై జరుగుతున్న చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. భార్యపై వ్యాఖ్యలను ఖండించడానికి, సభలో తన వాదన వినిపించడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేళ ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును తీవ్రంగా కలచివేశాయి. ఇదంతా తనను, తన కుటుంబాన్ని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కక్షసాధింపు చర్య అని ఆయన పేర్కొన్నారు.
సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు భోరున విలపించారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని మరీ విలవిలా ఏడ్చేశారు.
అంబటి రాంబాబు.. సభలో మరింత డబుల్ మీనింగ్‌తో మాట్లాడారు. చంద్రబాబును అవమానపరుస్తూ వెటకారంగా మాట్లాడుతూ.. మాధవరెడ్డి పేరు ప్రస్తావిస్తూ వేరే మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలను పరోక్షంగా గుర్తు చేశారు. అంబటి అలా మాట్లాడటంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు సభలోనే కంటతడి పెట్టారు. అసెంబ్లీని బహిష్కరిస్తూ.. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారు.
"ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నా. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు" అన్నారు చంద్రబాబు.
ఇప్పుడా ఘటనను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
Next Story

