నీ వయసుకి, నీ పదవికి ఇది తగునా చంద్రబాబూ?: బొత్స సత్యనారాయణ
x

నీ వయసుకి, నీ పదవికి ఇది తగునా చంద్రబాబూ?: బొత్స సత్యనారాయణ

మరో సారి సీఎం చంద్రబాబు మీద బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన వయసుకి, ముఖ్యమంత్రి పదవికి ఈ తీరు తగదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రేవంత్ మాటలకు సమాధానం ఏది?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ’నేను చెబితేనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు‘ అని చేసిన ప్రకటనపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని బొత్స ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం అంటే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, రేవంత్ రెడ్డి చెప్పినవి అబద్ధాలైతే ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు.
లడ్డూ ప్రసాదంపై అపోహలు
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అపోహలు సృష్టించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని బొత్స విమర్శించారు. గతంలో రూ.329 ఉన్న నెయ్యిని ఇప్పుడు టీటీడీ రూ.650 పెట్టి ఎందుకు కొంటోంది? హిందూపూర్ డెయిరీకి, సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థకు సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. గతంలో మజ్జిగ కూడా తన వ్యాపార సంస్థ నుంచే కొనాలని జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని, దేవుడి ప్రసాదాన్ని కూడా తన ధనదాహం కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది టీడీపీ ఆఫీస్ కాదు..
విజయవాడలో పుష్కరాల పేరుతో ఆలయాలను కూల్చినప్పుడు లేని భక్తి ఇప్పుడు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చిందని బొత్స ఎద్దేవా చేశారు. మండలిలో చర్చ జరగకుండా అధికార పక్ష సభ్యులే హంగామా చేస్తున్నారని, సభను తమ ఇష్టానుసారం నడపడానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదని హెచ్చరించారు. అబద్ధపు రిపోర్టులతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని, చంద్రబాబు మాయమాటలు, దోపిడీ ప్రజలకు తెలిసే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
Read More
Next Story