
బెంగాల్‌లో రత్న దేబ్‌నాథ్‌ను పోటీచేయించడం వెనక బీజేపీ లక్ష్యమేంటి?
కోల్‌కతా ఆర్‌జీ కర్ వైద్య కళాశాల అత్యాచారం-హత్య కేసులో బాధితురాలి తల్లిని పానిహటి నుంచి బరిలో నిలిపిన కాషాయ పార్టీ..
ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహటి నియోజకవర్గంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌జీ కర్ కేసులో బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. 2024లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. దీన్ని ఇప్పుడు ఎన్నికల ప్రధాన అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
భయం vs నమ్మకం..
మహిళల భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘చార్జ్‌షీట్’ విడుదల చేశారు. టీఎంసీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు “భయం vs నమ్మకం” మధ్య జరుగుతున్నవని వ్యాఖ్యానించారు.
పాలనా వైఫల్యాన్ని వ్యక్తిగత అనుభవంతో కలిపి చూపించే ప్రయత్నంలో భాగంగానే బాధితురాలి తల్లిని బీజేపీ బరిలోకి దింపిందన, ఇది ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ ప్లానేంటి?
ఈ కేసు కేవలం ఒక నేరంగా కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల లోపాలను బయటపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత, పర్యవేక్షణపై ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వద్దే ఆరోగ్య, హోం శాఖలు ఉండటంతో విమర్శలు మరింత పెరిగాయి.
ఇక ఈ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు కూడా రాజకీయంగా కీలకమయ్యాయి. వామపక్షాలు ఈ ఉద్యమంలో ముందుండగా, ఇప్పుడు బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. సీపీఐ(ఎం) తరఫున కలతన్ దాస్‌గుప్తా పోటీ చేస్తుండగా, టీఎంసీ నుంచి తీర్థంకర్ ఘోష్ బరిలో ఉన్నారు. దీంతో పానిహటిలో త్రిముఖ పోటీ ఏర్పడింది.
బీజేపీ ఈ నిర్ణయంతో మరో లక్ష్యాన్ని కూడా సాధించాలని చూస్తోంది. టీఎంసీతో తమకు “సెట్టింగ్” ఉందన్న ఆరోపణలను ఖండించాలనుకుంటోంది. బాధితురాలి తల్లి తమ పార్టీలో చేరడం ద్వారా ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తున్నట్లు చూపిస్తోంది.
అయితే, కొన్ని వర్గాలు ఈ చర్యను విమర్శిస్తున్నాయి. ఒక విషాదాన్ని రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ వ్యూహం ఎన్నికల చర్చను పూర్తిగా మార్చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

