తమిళనాడు ఎన్నికలు: అన్నామలైకి షాక్, మహిళలకు ప్రాధాన్యం..
x

తమిళనాడు ఎన్నికలు: అన్నామలైకి షాక్, మహిళలకు ప్రాధాన్యం..

27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాషాయ పార్టీ. అయితే బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలైకి టికెట్ లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.


Click the Play button to hear this message in audio format

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో కీలక నాయకుడు కె. అన్నామలై పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మహిళలకు ప్రాధాన్యం..

ఈ జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నుంచి, వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు ఉత్తర నుంచి బరిలోకి దించారు. అలాగే కృతిక శివకుమార్, కవితా శ్రీకాంత్, ఎస్. విజయధరణి వంటి మహిళా అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. గెలుపు అవకాశాలున్న స్థానాల్లో మహిళలను నిలబెట్టడం ద్వారా పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక దళిత ఓటర్లను ఆకర్షించేందుకు, పలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాసిపురం, అవినాశి, మనమదురై, వాసుదేవనల్లూరు వంటి ప్రాంతాల్లో పార్టీ పోటీకి సిద్ధమైంది.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అవినాశి నుంచి పోటీ చేయడం మరో ముఖ్య పరిణామంగా నిలిచింది. ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


వ్యూహంలో భాగమా?

అయితే, రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు ముఖచిత్రంగా నిలిచిన అన్నామలైకి టికెట్ ఇవ్వకపోవడం పార్టీ అంతర్గత వ్యూహాలపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఆయన భవిష్యత్తుపై కూడా చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో అన్నామలై సోషల్ మీడియా వేదిక X ద్వారా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ఒక సాధారణ కార్యకర్తగా బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మొత్తంగా ఈ జాబితా ద్వారా బీజేపీ మహిళలు, దళిత వర్గాలు, కొత్త నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే, అన్నామలైకి టికెట్ ఇవ్వకపోవడం పార్టీ వ్యూహంలో కీలక మలుపుగా మారింది.

Read More
Next Story