పశ్చిమ బెంగాల్ ఎన్నికలు:  బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
x

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

మమత బెనర్జీతో తలపడనున్న సువేందు అధికారి


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలు ఉన్న అసెంబ్లీకి 144 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రముఖ నాయకులకు స్థానం కల్పించారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బీజేపీ తరఫున సువేందు అధికారిని పోటీకి దింపింది. భబానీపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని పార్టీ పేర్కొంది.

2021లో జరిగిన ఉప ఎన్నికలో మమతా బెనర్జీ భబానీపూర్ నుంచి విజయం సాధించారు. అంతకుముందు నందిగ్రామ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి భబానీపూర్ ఉప ఎన్నిక ఆమెకు కీలకంగా మారింది.


ఇతర ప్రముఖ అభ్యర్థులు..

బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్‌పై విజయం సాధించారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాను రష్‌బెహారీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి నటుడు, రాజకీయ నాయకుడు రుద్రానిల్ ఘోష్ పోటీ చేయనున్నారు.


సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఛాన్స్..

ఈసారి బీజేపీ చాలా మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. అగ్నిమిత్ర పాల్‌ను అసన్సోల్ సౌత్ నుంచి మళ్లీ పోటీకి నిలిపారు. చందన బౌరి మరోసారి బంకురా జిల్లాలోని సాల్టోరా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శిఖా చటోపాధ్యాయను జల్పైగురిలోని దబ్‌గ్రామ్–ఫుల్‌బారి నియోజకవర్గం నుంచి మళ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే బాలూర్ఘాట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ లాహిరి పేరు మొదటి జాబితాలో కనిపించలేదు. ఆ స్థానంలో బిద్యుత్ రాయ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కూడా ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ముందుగానే నిర్ణయించుకుంది. అందుకే తొలి జాబితాలో అనేక మంది సుపరిచిత నాయకులకు టిక్కెట్లు లభించాయి.


రెండు దశల్లో బెంగాల్ ఎన్నికలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు, రాష్ట్రంలోని జంగిల్‌మహల్ ప్రాంతం సహా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 142 నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

అభ్యర్థుల జాబితా విడుదలతో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Read More
Next Story