బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టో విడుదల..
x

బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టో విడుదల..

6 నెలల్లో యూసీసీ హామీ, మహిళలకు నెలకు రూ. 3వేలు, చొరబాట్లపై కఠిన చర్యలు..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప పత్రం’ పేరుతో 15 అంశాలతో రూపొందించిన ఈ పత్రాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోల్‌కతాలో విడుదల చేశారు.

ఈ మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు, చొరబాట్లు, గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు ప్రధాన హామీలుగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూసీసీని అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఒకే విధమైన చట్టాలు అమలు చేస్తామని తెలిపింది.

మహిళల కోసం ప్రత్యేకంగా నెలకు రూ. 3వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నెల 1 నుంచి 5 తేదీల మధ్య ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) అందిస్తామని, 7వ వేతన సంఘం సిఫార్సులను 45 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పింది.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్‌లో ప్రతి వర్గానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ పాలనను “చీకటి కాలం”గా అభివర్ణించారు.

అక్రమ చొరబాట్లు, గోవుల స్మగ్లింగ్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానం పాటిస్తామని షా స్పష్టం చేశారు. బెంగాల్ సరిహద్దులను పటిష్టం చేస్తామని, అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికడతామని తెలిపారు.

సాంస్కృతికంగా కూడా బెంగాల్ పునరుద్ధరణపై దృష్టి సారిస్తామని చెప్పారు. పోయిలా బైశాఖ్ నుంచి రవీంద్రనాథ్ టాగోర్ జయంతి వరకు ఉన్న కాలాన్ని కొత్త ప్రారంభానికి ప్రతీకగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరిగిన రాజకీయ హింసపై విచారణకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని ఘటనలను విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే అవినీతి, రాజకీయ హింస, శాంతిభద్రతల పరిస్థితులపై మూడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు.

మొత్తంగా సంక్షేమ పథకాలు, భద్రతా చర్యలు, పరిపాలనా మార్పులతో బెంగాల్‌లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ తెలిపింది.

Read More
Next Story