
బీహార్ నుంచి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ కుమార్
నబిన్ ఎంపికతో అగ్రవర్ణాలకు ప్రాధాన్యం, శివేష్ ఎంపికతో దళిత వర్గాలకు ప్రాతినిధ్యం - బీజేపీ వర్గాలు
బీహార్ నుంచి రాజ్యసభకు బీజేపీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ను. ప్రస్తుతం బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నబిన్..ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ నుంచి రాజ్యసభకు ఆయన పేరు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. శివేష్ కుమార్ 2024లో ససారాం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ నిర్ణయం కొత్త తరం నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నబిన్ ఎంపికతో అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు, శివేష్ కుమార్ ఎంపికతో దళిత వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి మాట్లాడుతూ.. నితిన్ నబిన్ రాజ్యసభలో బీహార్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నారు. నబిన్, శివేష్ కుమార్ ఇద్దరూ మార్చి 5న నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా నామినేషన్ వేయనున్నారు. బీహార్‌లో మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి ఇద్దరు సభ్యులను గెలిపించే బలం ఉంది. మిగిలిన స్థానాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడీయూ పోటీ చేయనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కూడా ఒక సీటుకు పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే తమ అభ్యర్థిని ఇంకా వెల్లడించలేదు. దీంతో బీహార్‌లో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

