ఐపీఎస్ గ్రూపులో ’బిహార్‘ చిచ్చు..కలకలం రేపుతున్న పోస్టు ఇదే
x

ఐపీఎస్ గ్రూపులో ’బిహార్‘ చిచ్చు..కలకలం రేపుతున్న పోస్టు ఇదే

రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గ్రూపులో కలకలం రేపాయి.


ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌ల మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల వేదికగా వీధికెక్కింది. బిహార్ క్యాడర్ అధికారి అరెస్ట్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి.. ఏకంగా రాష్ట్రంలోని టాప్ ఐపీఎస్ అధికారుల గ్రూపులో బిహార్ చిచ్చును రాజేసింది. రాజకీయ నేతల కక్ష సాధింపులకు అధికారులు పావులుగా మారుతున్నారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ శాఖను కుదిపేస్తున్నాయి. ఒకరి తెలివితేటలను మరొకరిని వేధించేందుకు వాడుతున్నారంటూ సాటి అధికారులకు ఆయన ఇచ్చిన కౌంటర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా సర్క్యులేట్ అవుతోంది.

వివాదానికి బీజం.. బిహార్ ప్రభుత్వ నిర్ణయం
బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో, బిహార్ ప్రభుత్వం ఒక కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. తమ రాష్ట్ర అధికారులపై చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం న్యాయబద్ధం కాదని, కేవలం సునీల్ నాయక్‌ను రక్షించేందుకే హడావుడిగా తెచ్చిన నిబంధన అని రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఒక పోస్ట్ పెట్టారు.
మాదిరెడ్డి ప్రతాప్ ఘాటు స్పందన
రిటైర్డ్ ఐజీ దామోదర్ చేసిన వ్యాఖ్యలపై 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి, డీజీపీ స్థాయి అధికారి మాదిరెడ్డి ప్రతాప్ అత్యంత కటువుగా స్పందించారు. మన తెలివితేటలన్నీ సహచర పోలీసు అధికారులను వేధించేందుకేనా? రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గ్రూపులో కలకలం రేపాయి. కక్ష సాధింపు చర్యలు, ప్రతీకార రాజకీయాలకు పోలీసు అధికారులు బలికావొద్దని, అధికారిక వ్యవహారాలపైనే దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.
అధికారుల జైలు ప్రస్థానంపై హెచ్చరిక
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లిన పరిస్థితులను మాదిరెడ్డి ప్రతాప్ తన పోస్టులో గుర్తు చేశారు. రాజకీయ నేతల ప్రభావానికి లోనై చేసే తప్పుల వల్ల విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటువంటి కక్ష సాధింపు ధోరణులకు తక్షణమే ముగింపు పలకాలని, చట్టబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు.
పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్న మద్దతు
మాదిరెడ్డి ప్రతాప్ ఇచ్చిన ఈ సమాధానంపై పోలీస్ శాఖలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులకు రక్షణ కల్పిస్తుంటే, దానిని సాటి అధికారి తప్పుబట్టడాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో, ఒక సీనియర్ అధికారి ధైర్యంగా స్పందించి అధికారుల నైతిక బాధ్యతను గుర్తు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Read More
Next Story