
అస్సాం కాంగ్రెస్‌కు భారీ షాక్ - భూపెన్ కుమార్ బోరా రాజీనామా
బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం.. సీఎం హిమంత..
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకే పెద్ద దెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు. పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర యూనిట్‌లో తగిన గౌరవం దక్కలేదని లేఖలో పేర్కొన్నారు.
2021 నుంచి 2025 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన బోరా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. “32 ఏళ్లుగా పార్టీలో పనిచేశాను. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరైన సమయంలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు చెబుతాను” అని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల కాకుండా రాజకీయ పరిస్థితుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మరో పార్టీలో చేరతారా?
ఎన్నికల ముందు మరో పార్టీలో చేరతారా? అన్న ప్రశ్నకు బోరా సమాధానమిస్తూ ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి అధికారిక ఆహ్వానం రాలేదని చెప్పారు. అయితే రైజర్ దళ్ నేత అఖిల్ గోగోయ్ తనను కలిసి కొన్ని రాజకీయ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. కూటమి చర్చల్లో అభిప్రాయ భేదాలే తన అసంతృప్తికి కారణమని బోరాకు సమీప వర్గాలు చెబుతున్నాయి.
సీఎం హిమంత స్పందన
ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బోరా రాజీనామాపై స్పందించారు. “సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్‌లో అవకాశాలు తగ్గుతున్నాయి. బీజేపీ అలాంటి వారిని ప్రోత్సహిస్తుంది” అని వ్యాఖ్యానించారు. బోరా బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని, చేరకపోయినా శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసి భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై మాట్లాడతానని వెల్లడించారు.
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బహిర్గతం..
బోరా రాజీనామాతో అస్సాం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ సమస్యలు, కూటమి చర్చలపై విభేదాలే ఈ పరిణామానికి దారితీసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ రాజీనామా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా మారింది.

