
తెరపైకి మళ్లీ బీసీ రాజకీయ రిజర్వేషన్
ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. గతంలో 34 శాతం ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దాన్ని 24 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఇటీవల ఒక ప్రకటనలో ‘మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. ఇది ఎన్నికల హామీ. ఈ లక్ష్య సాధనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించాం’ అని పేర్కొన్నారు. మంత్రి సవిత మాటల్లోనే చెప్పాలంటే ఈ కమిషన్ బీసీలకు న్యాయం జరిగేలా, స్థానిక సంస్థల్లో వారి రాజకీయ ప్రాధాన్యత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీసీ సంక్షేమ శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ ఎస్ సత్యనారాయణ ఫిబ్రవరి 20న జారీ చేసిన జీవో నెం.3 మేరకు ఈ కమిషన్‌ను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ డి చంద్రశేఖర రాజు ఈ కమిషన్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తారు. గతంలో ఏపీ స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్‌ను డెడికేటెడ్ కమిషన్‌గా నియమించినప్పటికీ, దాని కాలపరిమితి 2025 సెప్టెంబర్ 20న ముగిసినందున కొత్తగా ఈ ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ విచారణ ద్వారా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది. అయితే 50 శాతం రిజర్వేషన్ పరిమితి సవాలుగా మారకుండా చూడాలి. కమిషన్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న బీసీలు ఈ ప్రక్రియలో సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం బీసీలలో వెనుకబాటు స్వభావం, పరిధి, ప్రభావాలపై సమకాలీన, కఠినమైన ‘ఎంపిరికల్’ విచారణ చేపట్టడం. సుప్రీం కోర్టు నిర్దేశాల మేరకు 'ట్రిపుల్ టెస్ట్' (డా. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్‌రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పులు) పాటించాలి. ఇందులో భాగంగా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ నిష్పత్తిని నిర్ణయించాలి. మొత్తం రిజర్వేషన్లు రాజ్యాంగపరమైన పరిమితిని మించకుండా చూడాలి.
ఎంపిరికల్ విచారణ అంటే ఏమిటి?
ఎంపిరికల్ విచారణ అంటే ఆధారాలు, డేటా, అధ్యయనాల ఆధారంగా చేసే విశ్లేషణ. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కచ్చితమైన, నమ్మదగిన పద్ధతులతో ఉంటుంది. బీసీల వెనుకబాటుతనం స్వభావం అంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్య, ఉపాధి, సామాజిక స్థితిగతులు అధ్యయనం చేయడం. జనాభా శాతం, ప్రాంతాల వారీగా సమస్యలు సమాజం, ఆర్థిక వ్యవస్థపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో రిపోర్టులో వివరించాలి. ఈ విచారణ సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు 'ట్రిపుల్ టెస్ట్' పాటిస్తుంది.
1.వెనుకబాటుతనం పై ఎంపిరికల్ అధ్యయనం,
2.స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ నిష్పత్తి నిర్ణయం,
3.మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడటం.
సమాచార సేకరణ పద్ధతులు
కమిషన్ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, యూనివర్శిటీలు, కమిషన్లు, ఇతర సంస్థల నుంచి సేకరిస్తుంది. నిపుణులు, అకాడమీషియన్లు, పరిశోధన సంస్థల సహాయం తీసుకుంటుంది. అవసరమైతే స్టడీ టూర్లు చేపట్టవచ్చు. పాత డేటాపై ఆధారపడకుండా, ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీల ఆధారంగా విశ్లేషణ చేస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) లాంటి సర్వేలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. బీసీల జనాభా లెక్కలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం లాంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.
రిపోర్టు కాలపరిమితి, ప్రయోజనాలు
కమిషన్ 45 రోజుల్లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఈ రిపోర్టు ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం 24 శాతం ఉండగా దీన్ని పెంచితే బీసీలకు రాజకీయ ప్రధాన్యత పెరుగుతుంది. విద్య, ఉపాధి, సంక్షేమంలో వారి సమస్యలు పరిష్కారమవుతాయి. మహిళల 33 శాతం రిజర్వేషన్‌తో కలిసి, బీసీ మహిళల ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. మొత్తంగా సామాజిక న్యాయం సాకారమవుతుంది.
34 శాతం రిజర్వేషన్ సాధ్యమేనా? మహిళల 33 శాతం ప్రభావం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో ఎస్‌సీలకు జనాభా నిష్పత్తి మేరకు 15-16 శాతం, ఎస్‌టీలకు 6-7 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు 24 శాతం అమలవుతోంది. 34 శాతానికి పెంచితే వర్టికల్ రిజర్వేషన్లు (ఎస్‌సీ/ఎస్‌టీ/బీసీ) మొత్తం 55-57 శాతానికి చేరుతాయి. సుప్రీం కోర్టు నిర్దేశాల మేరకు స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదు. ఇది ప్రధాన సవాలు.
గతంలో 34 శాతం అమలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 2019లో ఇది అమలులో ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో 16,500 మంది బీసీలు ప్రాతినిధ్యం కోల్పోయారు. బీసీల జనాభా దాదాపు 50 శాతం ఉన్నందున, జనాభా ఆధారిత కుల గణన అవసరమని, 50 శాతం పరిమితిని మించి అమలు చేయాలని కొందరు వాదిస్తున్నారు. తమిళనాడులో ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్టుగా, స్థానిక సంస్థల్లో కూడా ఆయా రాష్ట్రాలు సవరణలు చేసుకోవచ్చు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హారిజంటల్‌గా (కేటగిరీలు క్రాస్ చేసి) అమలవుతోంది. ఇది వర్టికల్ రిజర్వేషన్లపై ప్రభావం చూపదు. దీంతో స్థానిక సంస్థల్లో మహిళల సంఖ్య పెరిగింది. బీసీలకు 34 శాతం అమలైతే, మహిళల రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
అమలైతే బీసీలకు వచ్చే ప్రయోజనాలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలైతే సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయ శక్తి పెరుగుతుంది. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగడంతో వారి సమస్యలు (విద్య, ఉపాధి, సంక్షేమం) పరిష్కారమవుతాయి. మహిళల 33 శాతం రిజర్వేషన్‌తో కలిసి, బీసీ మహిళల ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో వారి పాత్ర పెరుగుతుంది. మొత్తంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు సాకారమవుతాయి. ఇది ఎన్నికల హామీ కావడంతో ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు కమిషన్ ను నియమించింది. అయితే 50 శాతం పరిమితి సవాలుగా మారకుండా చూడాలి.

