దేవుడంటే బాబుకు భయమూ లేదు.. భక్తీ లేదు: జగన్
x

దేవుడంటే బాబుకు భయమూ లేదు.. భక్తీ లేదు: జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ మరో సారి ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.


తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం మంటగలుపుతున్నారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ ఛైర్మన్ నియామకం నుంచి నెయ్యి కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు భక్తి కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు.

ఆరోపణలున్న వ్యక్తికే అత్యున్నత పీఠమా?
తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి ఛైర్మన్‌గా ఉండే వ్యక్తికి నిష్కలంకమైన వ్యక్తిత్వం ఉండాలని, కానీ బాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వదలలేదని జగన్ విమర్శించారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశాడని, మహిళలను ఇబ్బంది పెడతారని ఒక మహిళ ఎన్నికల ముందే లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు.
విచారణ ఏదీ?: ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిపై విచారణ జరిపించాల్సింది పోయి, ఏకంగా టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం ఆలయ పవిత్రతను కాలరాయడమేనని దుయ్యబట్టారు.
బాబు హయాంలోనే కల్తీ నెయ్యికి అనుమతి
లడ్డూ తయారీలో వాడే నెయ్యి విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఆయనకే చుట్టుకుంటున్నాయని జగన్ పేర్కొన్నారు. సీబీఐ-సిట్ దాఖలు చేసిన మొదటి ఛార్జ్‌షీట్ (పేజీ 64, 91), ఫైనల్ ఛార్జ్‌షీట్ (పేజీ 44)లలోని అంశాలను ఆయన ప్రస్తావించారు. నెయ్యి నాణ్యత లేదని గతంలో తిప్పి పంపిన ట్యాంకర్లే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వేరే పేర్లతో వచ్చి తిరుమల లడ్డూ తయారీలోకి ప్రవేశించాయని, వాటిని ప్రభుత్వం ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. ఇది బాబు నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
నెయ్యి ధర రూ. 658.. హెరిటేజ్ కోసమేనా?
టీటీడీ నెయ్యి సరఫరాను చంద్రబాబు తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని జగన్ సంచలన ఆరోపణ చేశారు. గత పదేళ్లుగా నెయ్యి కిలో ధర సగటున రూ. 278 నుంచి రూ. 330 వరకు ఉంటే, ఇప్పుడు దానిని ఏకంగా రూ. 658లకు పెంచారని తెలిపారు. చంద్రబాబు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, దానికి సంబంధించిన ఇందాపూర్ డెయిరీకి మేలు చేయడానికే ఈ ధరలు పెంచారని, శ్రీవారి నెయ్యి కొనుగోలులో కూడా స్కామ్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, ఆ నెపం వేరొకరిపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. దేవుడిపై భయం, భక్తి ఉన్నవారెవ్వరూ ఇలాంటి పనులు చేయరని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story