
కలకలం రేపుతున్న వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు
పదవీ వ్యామోహం కోసం ఒక వ్యక్తి ఎంతటికైనా తెగిస్తారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో మరోసారి పాత గాయాలు, వివాదాలు తెరపైకి వచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, శాసన మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మీద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాటి ఘటనలపై సంచలన ఆరోపణలు చేశారు.
ఆచూకీ తెలియకముందే సీఎం పదవి కోసం పాకులాట?
వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతై, ఆయన ఆచూకీ తెలియక రాష్ట్రమంతా ఆందోళనలో ఉన్న తరుణంలో జగన్ ప్రవర్తన విస్మయానికి గురిచేసిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఓవైపు తండ్రి క్షేమ సమాచారం తెలియక అందరూ కన్నీరుమున్నీరవుతుంటే, జగన్ మాత్రం అప్పుడే సీఎం పదవి కోసం పాకులాడారు. మరణం కూడా నిర్ధారణ కాకముందే సంతకాల సేకరణ ఎలా చేస్తారు? అని ఆయన నిలదీశారు. పదవీ వ్యామోహం కోసం ఒక వ్యక్తి ఎంతటికైనా తెగిస్తారని మండిపడ్డారు.
బొత్స పైనా తీవ్ర విమర్శలు
వైఎస్ఆర్ మృతి వెనుక ఉన్న అనుమానాలపై గతంలో సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ సాక్షాత్తూ బొత్స సత్యనారాయణే నాడు మాట్లాడారు.. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలచుకుని అధికార పీఠం ఎక్కాలని చూసిన ఇలాంటి మనస్తత్వం సభ్య సమాజంలో మరెవరికీ ఉండదు అని వ్యాఖ్యానించారు. ఒక సైకో కు పదవిపై వ్యామోహం వస్తే ఏమైనా చేస్తారంటూ ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు.
రిలయన్స్ అంశంపై వైఖరి మార్పుపై ప్రశ్నలు
అప్పట్లో రిలయన్స్ ఏజెన్సీలపై దాడులు చేయించిన విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. వైఎస్ఆర్ మృతికి రిలయన్సే కారణమని నాడు ప్రచారం చేయించి ఆ సంస్థ ఆస్తులపై దాడులు చేయించారు. కానీ, తర్వాత అదే రిలయన్స్ ప్రతినిధులను మంచి చేసుకుని రాజ్యసభ స్థానాలు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ క్షణంలోనైనా తన వైఖరిని మార్చుకుంటారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో తన తండ్రి మరణాన్ని సైతం వాడుకున్న వ్యక్తి జగన్ అని, ఆయన అధికార దాహం ఆనాడే బయటపడిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతున్నాయి.
Next Story

