
అస్సాం ఎన్నికలు : కాంగ్రెస్, రైజోర్‌దళ్ మధ్య కుదిరిన ఒప్పందం
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమన్న ప్రతిపక్ష నేతలు..
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య కీలక కూటమి ఏర్పడింది. బీజేపీకి పోటీగా కాంగ్రెస్, రైజోర్ దళ్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
వారాల పాటు కొనసాగిన చర్చలకు ముగింపు పలుకుతూ.. కాంగ్రెస్, రైజోర్ దళ్ మధ్య సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరింది. రైజోర్‌దళ్ 13 స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండబోతుంది. ఈ ఒప్పందంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ సంతకాలు చేశారు.
ఎవరు ఎక్కడి నుంచి..
పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక ఆందోళనల సమయంలో నమోదైన కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్న అఖిల్ గొగోయ్ శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మార్గరిటా సీటును కాంగ్రెస్ రైజోర్ దళ్‌కు కేటాయించింది. తన తండ్రి బీజేపీలో చేరిన నేపథ్యంలో ప్రతీక్ బోర్డోలోయ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరోవైపు మరియాని నియోజకవర్గం నుంచి జ్ఞానశ్రీ బోరా అనే మహిళా అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టింది.
ఈ ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్, రైజోర్ దళ్‌తో పాటు అస్సాం జాతీయ పరిషత్ (AJP), సీపీఎం, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC), సీపీఐ(ఎంఎల్) పార్టీలూ ఉన్నాయి. కాంగ్రెస్ 87 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇతర మిత్రపక్షాలకు కూడా సీట్లు కేటాయించారు.
కూటమి ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గౌరవ్ గొగోయ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చిందని, జాతీయ నాయకత్వం కూడా దీనికి అంగీకరించిందని చెప్పారు.
‘ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం..’
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.
126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

