
అస్సాం సీఎంపై వామపక్ష నేతల పిటిషన్ విచారణకు సుప్రీం అంగీకారం..
‘‘సీఎం చేసిన ప్రసంగాలు, వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఫిర్యాదులు ఇచ్చినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదు’’ - వామపక్ష నాయకుల తరఫు న్యాయవాది
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు సంబంధించిన వైరల్ వీడియోపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వీడియోలో శర్మ ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్నట్లు చూపించారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు కోర్టును ఆశ్రయించారు.
మంగళవారం ఈ వ్యవహారంపై ప్రస్తావన వచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను జాబితా చేయడాన్ని పరిశీలిస్తామని తెలిపింది. “ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఇలాంటి అంశాలు కోర్టుల్లోకి వస్తాయి. అదే సమస్య. తేదీని నిర్ణయిస్తాము” అని సీజేఐ వ్యాఖ్యానించారు.
వామపక్ష నాయకుల తరఫున న్యాయవాది నిజాం పాషా వాదిస్తూ, సీఎం చేసిన ప్రసంగాలు,వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఫిర్యాదులు ఇచ్చినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణ జోక్యం అవసరమని కోర్టును కోరారు.
ఫిబ్రవరి 7న అస్సాం బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా, అది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హింసను ప్రోత్సహించేలా ఉందని విమర్శలు రావడంతో ఆ పోస్ట్‌ను తర్వాత తొలగించారు.
ఈ వివాదంపై సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి, సీఎం పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదని పేర్కొంటూ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు విభజన వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరో 12 మంది పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో తదుపరి విచారణ తేదీపై ఆసక్తి నెలకొంది.

