Kapu, Kamma
x
కాపు, కమ్మల గొడవగా మారుతున్న లడ్డూ వివాదంపై ప్రతీకాత్మక చిత్రం

లడ్డూ వివాదం: కాపు, కమ్మ కులాల మధ్య రగిలిన రాజకీయ మంటలు?

అంబటి అరెస్ట్‌తో కాపుల ఆగ్రహం… జనసేనలో కలకలం


ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ కల్తీ వివాదం ఇప్పుడు ఒక సాధారణ పాలనా అంశంగా కాకుండా, క్రమంగా కుల సమీకరణాల్ని తాకే రాజకీయ సంక్షోభంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కేవలం “కల్తీ” లేదా “అవినీతి” ప్రశ్నగా మాత్రమే కాకుండా, కమ్మ ఆధిపత్యం ఉన్న TDP, కాపు సామాజిక బేస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారుతోందన్న చర్చ బలపడుతోంది.

ఈ పరిణామాలకు తాజా మంటలు రేపింది మాజీ YSRCP మంత్రి, ప్రముఖ కాపు నేత అంబటి రాంబాబు అరెస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దూషణాత్మక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకోవడం, కాపు వర్గాల్లో ఆగ్రహాన్ని పెంచినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కాపు నేతలు ప్రశ్నిస్తున్నది ఒక్కటే.. “రాంబాబుపై వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం, అదే తరహా వ్యాఖ్యలు చేసిన TDP నేతలపై ఎందుకు స్పందించలేదు?”
ఈ ప్రశ్న ఇప్పుడు “చట్టపరమైన చర్య” నుంచి బయటికి వచ్చి, “ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారా?” అన్న అనుమానానికి దారి తీస్తోందని కాపు సంఘాల నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రెస్ కాన్ఫరెన్సులు, పత్రికా ప్రకటనలు చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

జనసేనలో ‘కాపు అసంతృప్తి’ బహిర్గతమవుతోందా?

ఈ వివాదం కేవలం YSRCP–TDP మధ్య మాటల యుద్ధంగా మాత్రమే పరిమితం కాలేదు. అసలు కీలక పరిణామాలు అధికార కూటమిలోని జనసేన శిబిరంలో చోటుచేసుకోవడం విశేషం.
ఇటీవల జనసేన ప్రతినిధి రజనీ “TDP ఒక ప్రత్యేక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తోంది” అన్న వ్యాఖ్య చేయడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే జనసేన ఇది నచ్చలేదు. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని, లేకపోతే తప్పుకోవాల్సి ఉంటుందని ఆమెకు హెచ్చరికలు ఇచ్చినట్లు సమాచారం.

రజనీ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమా?

లేదా జనసేనలో లోపల మగ్గుతున్న అసంతృప్తి బహిర్గతమైందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇది పార్టీ నాయకత్వం ఒక వ్యక్తిని మందలించడంగా మాత్రమే చూడలేం. ఎందుకంటే అదే సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేయడం మరింత బలమైన సంకేతంగా మారింది. ఇది కూటమిలో జనసేన పాత్రపై, ప్రత్యేకంగా కాపు బేస్‌లో ఉన్న అసంతృప్తిపై లోతైన చర్చకు దారితీస్తోంది.
‘పొత్తు ధర్మం అంటే ఇదేనా?’
ఈ పరిణామాల వెనుక మరో పెద్ద చర్చ కూడా నడుస్తోంది—జనసేనలో “పార్టీ కోసం మొదటినుంచి పనిచేసిన కార్యకర్తలు, మద్దతుదారులు వెనక్కిపోతున్నారు. కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధాన్యం పెరుగుతోంది” అన్న అభిప్రాయం క్యాడర్ లో బలపడుతోంది.
పార్టీ ఉద్యమ దశలో తుందుర్రు భూముల పోరాటం, ఉద్దానం కిడ్నీ బాధితుల ఉద్యమం, ప్రత్యేక హోదా నిరసనలు, రాజధాని భూముల పరిరక్షణ వంటి సందర్భాల్లో జనసేనకు మద్దతుగా అనేక మంది కార్యకర్తలు, రచయితలు, సానుభూతిపరులు నిలబడ్డారు. అయితే ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం వచ్చిన తరువాత కూడా “పదవులు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక స్థాయి ప్రాధాన్యం” విషయంలో తమకు స్థానం దక్కడం లేదన్న ఆవేదన పార్టీ లోపల వ్యక్తమవుతోంది.
బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇటీవల విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ “కూటమిలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. కనీస గుర్తింపుకైనా నోచుకోవడం లేదు” అని ఓపెన్‌గా వ్యాఖ్యానించారు. నిరసనగా ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి తప్పుకున్నారు. ఆయన చేసిన ప్రకటనకు రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల నుంచి మద్దతు లభించడం పార్టీ లోపలి ఆవేదన తీవ్రతను సూచిస్తోంది.
ఇంకొక వైపు, జనసేన గెలుచుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చాలామంది ఇతర పార్టీల నుంచి వచ్చినవారే అన్న చర్చ కూడా కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచుతోంది. “పార్టీ కోసం కష్టపడ్డవాళ్లకు కాదు, రాజకీయ సర్దుబాట్లలో వచ్చినవారికి పదవులు దక్కుతున్నాయి” అన్న భావన బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
కూటమిలో పవన్ కల్యాణ్ స్థానం ఏమిటి?
కాపు సామాజిక బేస్‌లో ఒక భావన పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి? “పవన్ కల్యాణ్ TDP పట్ల అత్యంత ,చాలా జాగ్రత్తగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎక్కడ ఇరుకునపెట్టకుండా వ్యవహరిస్తున్నారు.” పవన్ కల్యాణ్ కూటమిలో సమాన బాధ్యడు. పార్టీ కార్యకర్తలను, లీడర్లను టిడిపి గౌరవించాలి. అయితే అలా జరడం లేదు. నియోజకవర్గం, పట్టణ స్థాయిలలో టిడిపి బాగా పెత్తనం చలాయిస్తున్నదని, జనసేన నేతలను ఖాతరు చేయడం లేదనేది పార్టీలో విమర్శ. సీనియర్ నాయకుడు బొలి శెట్టిరాజీనామా వెనక కారణం అదే. దీనిని పవన్ సీరియస్ గా తీసుకుంటున్నట్లు లేరున కూటమి నిలబడాలన్న రాజకీయ అవసరంతో పవన్ తన బేస్‌లోని అసంతృప్తిని పూర్తిగా వక్తీకరించ లేకపోత౮న్నారా ? అనే ఆవేదన అభిమానుల్లో ఉంది.
“ప్రశ్నించండి, ప్రశ్నించడం కోసమే జనసేన ఉంది” అని చెప్పిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ప్రశ్నించిన వారిని పక్కన పెడుతున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదే సందర్భంలో ఒక కీలక ప్రశ్న ముసురుకుంటోంది:
కూటమి అవసరమా?
లేదా కాపు బేస్ రాజకీయ గౌరవమా?
లడ్డూ వివాదం ఒక ‘సామాజిక ఫ్లాష్‌పాయింట్’గా మారుతోందా?
లడ్డూ కల్తీ వివాదం మొదట ఒక పాలనా అంశంగా కనిపించినా, ఇప్పుడు అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక “ట్రిగ్గర్”గా మారింది.
అంబటి అరెస్ట్, కాపు ఆగ్రహం, జనసేనలో బహిర్గతమవుతున్న అసంతృప్తి, రజనీకి హెచ్చరికలు, బొలిశెట్టి రాజీనామా—ఇవన్నీ ఒకే దారిలో సూచిస్తున్నాయి:
ఆంధ్రప్రదేశ్‌లో కుల సమీకరణాలు మళ్లీ రాజకీయ కేంద్రంలోకి వస్తున్నాయి.
కమ్మ ఆధిపత్యం ఉన్న TDP పాలనలో కాపు బేస్ ఎంతవరకు సంతృప్తిగా ఉంటుంది?
జనసేన నిజంగా స్వతంత్ర శక్తిగా నిలబడుతుందా?
లేదా TDPకి అనుబంధంగా కరిగిపోతుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

రాజకీయంగా ఇది ఎక్కడికి దారి తీస్తుంది?

ఇది ఇప్పట్లో ప్రభుత్వ స్థిరత్వానికి ముప్పు కాకపోయినా, కూటమి లోపలి సామాజిక సమీకరణాల్లో ఒత్తిళ్లు పెరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది.
లడ్డూ వివాదం ఒక చిన్న ఘటనగా మొదలై, ఇప్పుడు అధికార కూటమిలోని బేస్ రాజకీయాలను తాకుతూ, “కాపు–కమ్మ” సమీకరణాల్ని మళ్లీ వేడెక్కించే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి మరింత బహిర్గతమైతే, అది కూటమి రాజకీయ సమతౌల్యాన్నే ప్రశ్నించే స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
Read More
Next Story