
అప్పుడైనా, ఇప్పుడైనా ఢిల్లీ లాయర్లకు డబ్బేడబ్బు!
అప్పుడు ముకుల్ రోహత్గీ, ఇప్పుడు సిద్దార్థ్ లూథ్రా! ఏపీలో కొనసాగుతున్న ‘ఫీజుల’ రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా, ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా ఒక అంశంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. అదే.. ఢిల్లీ నుంచి వచ్చే ఖరీదైన న్యాయవాదులకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో చెల్లించడం. గత వైసీపీ ప్రభుత్వం తన విధానాలను కాపాడుకోవడానికి ముకుల్ రోహత్గీ వంటి హేమాహేమీలకు కోట్లు కుమ్మరించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన కేసుల కోసం సిద్ధార్థ్ లూథ్రాకు అదే స్థాయిలో చెల్లింపులు చేస్తోంది.
రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత ఉందని, జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నామని, కాంట్రాక్టర్లకు రూ. 50 వేల బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఒకవైపు కూనిరాగాలు తీస్తున్న పాలకులు, న్యాయవాదుల కోసం వెచ్చిస్తున్న భారీ మొత్తాలు చూస్తుంటే సామాన్యుడికి గుండె చెరవవుతుందనడంలో సందేహం లేదని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అది వైసీపీ అయినా ఇది టీడీపీ అయినా ఈ వ్యవహారంలో దొందూదొందేనని సీపీఐ నాయకుడు ఆర్. రవీంద్రనాధ్ అన్నారు.
ఈ పోలిక చూడండి..
రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయ పోరాటాల కోసం ప్రజాధనాన్ని ఎలా వెచ్చిస్తున్నాయంటే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మొదటి రెండేళ్ల కాలంలో దాదాపు 12 కోట్ల రూపాయల వరకు లాయర్లకు సమర్పించుకుంటే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 10 కోట్లకుపైగా ఢిల్లీ లాయర్లకు సమర్పించుకుంది.
గతంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, మూడు రాజధానుల అంశం, రాజధాని వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో వాదనలు వినిపించడానికి దేశంలోని టాప్ లాయర్లలో ఒకరైన ముకుల్ రోహత్గీని రంగంలోకి దించింది. అప్పట్లో కేవలం ఈ ఒక్క వివాదంపై వాదనల కోసమే ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 1 కోటిని అడ్వాన్స్‌గా చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా అందజేసింది. అప్పట్లో ఈ భారీ ఫీజులపై నేటి అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది.
అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం తన నమ్మకస్థుడైన న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు గత రెండేళ్ల కాలంలో వివిధ కేసులకు సంబంధించి ఏకంగా రూ. 10.54 కోట్లు చెల్లించింది. ముఖ్యంగా మద్యం అక్రమ కేసులు, సీఐడీ దర్యాప్తులకు సంబంధించిన పిటిషన్లపై ఒక్క రోజు వాదనలకే రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజుగా ఇస్తోంది. దీనికి అదనంగా 10 శాతం ఇతర క్లరికల్ జాబ్ కోసం కలిపి జీవోలు జారీ చేయడం గమనార్హం.
ఖజానా ఖాళీ.. కానీ లాయర్లకు మాత్రం ‘కోట్లు’..
ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి ఈ ఫీజుల చెల్లింపులే నిదర్శనం. గత ప్రభుత్వంలో రోహత్గీ ఒక్కో హాజరీకి భారీగా వసూలు చేయగా, ఇప్పుడు లూథ్రా కూడా అదే స్థాయిలో ఫీజులు అందుకుంటున్నారు.
నవంబర్ 25 నుండి డిసెంబర్ 2 వరకు: కేవలం ఈ కొద్ది రోజుల్లోనే మద్యం కేసులకు సంబంధించి లూథ్రాకు సుమారు రూ. 77 లక్షలు చెల్లించారు.
సెప్టెంబర్ నెలలో: ఐదు కేసుల కోసం ఏకంగా రూ. 1.10 కోట్లు చెల్లించినట్లు జీవో నంబర్ 104 తెలుపుతుంది.
సంబంధం లేని ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల వంటి కేసుల్లో కూడా సీనియర్ కౌన్సిల్స్‌ను నియమించి లక్షలాది రూపాయలు ధారబోయడంపై పౌర సమాజం నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.
అధికారంలో ఎవరున్నా.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము మాత్రం న్యాయవాదుల ఖాతాల్లోకి కోట్లకు కోట్లుగా చేరుతోంది. ఒక ప్రభుత్వం రోహత్గీకి రూ. 5 కోట్లు ఇస్తే, మరో ప్రభుత్వం లూత్రాకు రూ. 10 కోట్లు ఇస్తోంది. రాజకీయ కక్ష సాధింపులు, విధానపరమైన వివాదాల మధ్య సామాన్యుడి సొమ్ము ఇలా లాయర్ల పరమవ్వడం ఏపీ రాజకీయాల్లో ఒక 'ఖరీదైన' ఆనవాయితీగా మారిపోయింది.

