Pawan Kalyan
x

జగన్ చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం: పవన్ కల్యాణ్

ఏపీని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు": పవన్ కల్యాణ్ నిప్పులు


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ సాక్షిగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, గందరగోళ పరిస్థితులకు కారణమైందని మండిపడ్డారు. "వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుల కుప్ప.. పెండింగ్ బిల్లుల తిప్పలు!
ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం సుమారు రూ. 9 లక్షల కోట్ల అప్పులను కూటమి ప్రభుత్వంపై మోపిందని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం రూ. 35 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ. 25 వేల కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల 'జలజీవన్ మిషన్' కింద రావాల్సిన రూ. 8,700 కోట్ల కేంద్ర నిధులు నిరుపయోగంగా మారాయని పవన్ పేర్కొన్నారు.
విద్యుత్ రంగం అతలాకుతలం
వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వల్ల డిస్కంలకు రూ. 12,250 కోట్ల నష్టం వాటిల్లిందని పవన్ తెలిపారు. మొత్తం మీద విద్యుత్ సంస్థలు రూ. 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయని, ఆ భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూఅప్ చార్జీలు రద్దు చేసి, 'ట్రూడౌన్' పేరిట ఛార్జీలు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు.
"నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదు.. భావితరాల కోసం" అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను ఉటంకిస్తూ, ప్రస్తుత బడ్జెట్ చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని పవన్ కొనియాడారు.
చంద్రబాబు ధైర్యానికి ప్రశంసలు
ఇంతటి కఠినమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సామాన్యం కాదని పవన్ అన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసమే ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు ధైర్యం సామాన్యమైంది కాదని ప్రశంసించారు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల కుప్పలను సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తాము యుద్ధం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
Read More
Next Story