లేపేస్తాంపై క్యాబినెట్ లో రసవత్తర చర్చ!
x
ఏపీ క్యాబినెట్ మీటింగ్ దృశ్యం

'లేపేస్తాం'పై క్యాబినెట్ లో రసవత్తర చర్చ!

'వైసీపీ వాళ్లు ఎవర్ని లేపేస్తారట, వాళ్ల సంగతి తేలుస్తా!': చంద్రబాబు


ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఇవాళ ఆసక్తికర చర్చ సాగింది. మామూలు ప్రస్తావనతో మొదలైన చర్చ కాస్తా సీరియస్ అయింది. వైసీపీ నేతలు కొందరు.. 'వాళ్లను లేపేస్తాం, వీళ్లను లేపేస్తాం, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతాం, తిప్పిచ్చి తిప్పిచ్చి కొడతాం' అంటున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎవరన్నారు, ఎప్పుడన్నారని సీఎం ప్రశ్నించడంతో నిమ్మల పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్ లోని ఓ మీడియా సంస్థపై దాడులు చేశారని, ఆ సందర్భంలో కొందరు ఇటువంటి పదాలు వాడారని నిమ్మల చెప్పుకొచ్చారు. ‘కొత్త పలుకు కాదు... ఇక పలుకే ఉండదు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు రామానాయుడు కేబినెట్‌కు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘లేపేస్తాను అని అంటున్నారు... వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఎవరిని లేపుతారు.. ఇటువంటి క్రిమినల్స్ చేసే బెదిరింపులకు ఎవరూ భయపడరు’ అని సీఎం అన్నారు.
క్రిమినల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్మ్‌గా డీల్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బెదిరించి భయపెడదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలని, అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ‘క్రిమినల్స్ ఇలానే రాజకీయాలు చేస్తారు. వాళ్ల ఆటలు సాగనివ్వకూడదు. ప్రజలకు నిజాలు తెలియచేస్తే సరిపోతుంది. డైవర్షన్ పాలిటిక్స్‌కు వాళ్లు అలవాటు పడ్డారు’ అంటూ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు.
కేబినెట్ అజెండా లీక్ అవుతున్న విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ‘కేబినెట్ అజెండాలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి... మనం జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం అన్నారు. గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరు లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతికతతో ఎవరి నుంచి లీక్ అయిందో తేలికగా కనుక్కోవచ్చని స్పష్టం చేశారు.
Read More
Next Story