
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మరో సంచలన వీడియో.. జనసేన శ్రేణుల్లో కలకలం
బాధితురాలు సంధించిన సూటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పెను సంచలనంగా మారింది. తనపై లైంగిక దాడికి పాల్పడి, బలవంతంగా గర్భస్రావాలు చేయించారంటూ గతంలోనే ఆరోపణలు చేసిన బాధితురాలు, తాజాగా విడుదల చేసిన మరో వీడియో జనసేన శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అధిష్టానం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇంకా బయటకు రాకముందే, నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అన్న ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యే బహిరంగంగా జనసేన కండువాతో ప్రత్యక్షమవ్వడంపై ఆమె నిప్పులు చెరిగారు. అరవ శ్రీధర్‌కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా? లేక లోలోపలే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేశారా? అంటూ బాధితురాలు సంధించిన సూటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం.. పార్టీ మౌనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నివేదిక రాకుండానే క్లీన్ చిట్ ఇచ్చారా
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తనపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, పలుమార్లు బలవంతంగా గర్భస్రావం చేయించారంటూ సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు మరోసారి సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చారు. తన ఫిర్యాదుపై పార్టీ అధిష్టానం విచారణ కమిటీని నియమించినా, ఆ నివేదిక ఇంతవరకు వెలుగు చూడకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతటి ఘోరానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, పార్టీ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడు పట్టించుకోకుండా ఎమ్మెల్యే యథేచ్ఛగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆమె సంధించిన సూటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అధినాయకత్వ ఆదేశాలను తుంగలో తొక్కారా?
అరవ శ్రీధర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో జనసేన అధినాయకత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ, ఆ నివేదిక వచ్చే వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ కమిటీ నివేదిక ఏమైందో.. అసలు విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ, ఈ లోపే ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం ముక్కావారిపల్లిలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకుని దర్జాగా ప్రత్యక్షమవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అరవ శ్రీధర్‌కు అసలు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా? లేక లోలోపలే ఆయనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారా? అంటూ బాధితురాలు ఆవేదనతో నిలదీసిన తీరు పార్టీ శ్రేణుల్లోనే కలకలం రేపుతోంది.
ప్రభుత్వ మౌనంపై విమర్శలు.. కాలయాపన ఎవరి కోసం?
ఈ తీవ్రమైన వ్యవహారంలో ప్రభుత్వం, కూటమి నాయకుల మౌనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంతవరకు ఈ ఘటనను ఖండించకపోవడాన్ని బాధితురాలు తప్పుబడుతున్నారు. రెండు రోజుల క్రితం వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే సాకుతో ఎమ్మెల్యే పొలాల్లో పర్యటిస్తూ ప్రజలకు ముఖం చూపించడం చూస్తుంటే, పార్టీ కావాలనే కాలయాపన చేస్తోందనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు.
Next Story

