
అస్సాం కాంగ్రెస్‌లో కలకలం..
బీజేపీ వైపు భూపేన్ బోరా .. రైజోర్ దళ్‌లోకి షెర్మాన్ అలీ అహ్మద్..
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ రైజోర్ దళ్ పార్టీలో అధికారికంగా చేరారు.
బీజేపీ వైపు భూపేన్ బోరా..
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఒక రోజు తరువాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గౌహతిలోని బోరా నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపిన అనంతరం, బోరా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు సీఎం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా ఆ కార్యక్రమ వివరాలు త్వరలో వెల్లడిస్తారని తెలిపారు.
బోరా నిర్ణయం కాంగ్రెస్‌ను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించిన సీఎం.. “కాంగ్రెస్‌లో కుటుంబ నేపథ్యం లేకుండా ఎదిగిన చివరి హిందూ నేత బోరానే” అని పేర్కొన్నారు. అయితే బోరా విలేకరుల సమావేశంలో మాట్లాడకుండా మౌనం పాటించారు. అసెంబ్లీ సీటు కోసం కాకుండా రాజకీయ వేదిక కోసం బీజేపీలో చేరుతున్నారని సీఎం పేర్కొన్నారు.
రైజోర్ దళ్‌లోకి షెర్మాన్ అలీ అహ్మద్..
ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ బార్పేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ‘రైజోర్ దళ్’ లో చేరారు. ఆ పార్టీ అధినేత అఖిల్ గోగోయ్ ఆయనకు స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో మాండియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అహ్మద్ తెలిపారు.
“పేదలు, అణగారిన వర్గాల కోసం స్వరం వినిపించినందుకే కాంగ్రెస్, AIUDF రెండూ నన్ను దూరం చేశాయి. ప్రజల హక్కుల కోసం నా పోరాటం కొనసాగుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో AIUDF నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, తర్వాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు గెలిచిన అహ్మద్‌ను 2021లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు.
ఇటీవల మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుర్ రషీద్ మండల్ కూడా రైజోర్ దళ్‌లో చేరడం గమనార్హం. కాంగ్రెస్‌లో కింది స్థాయి నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణ ప్రతిస్పందన రాలేదు. అయితే అస్సాం రాజకీయాల్లో ఈ మార్పులు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

