Ambati Rambabu
x
పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం (పాత చిత్రం)

అంబటి రాంబాబుకు అర్ధరాత్రి రిమాండ్

పొద్దుపోయే వరకు వాదనలు, రాజమండ్రి జైలుకు తరలింపు


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి.స్రవంతి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13 వరకు రిమాండ్ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
శనివారం గుంటూరు గోరంట్ల వద్ద అంబటి తన వాహనంలో ప్రయాణిస్తూ పోలీసులపైన, ముఖ్యమంత్రిపైన వ్యక్తిగత దూషణలకు పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదు అయింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై TDP శ్రేణులు భగ్గుమనగా, అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిగాయి. అంబటి ఇంటికి నిప్పు పెట్టారు కొందరు దుండగులు.
గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం శనివారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేసి, ఆదివారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వాదనలు

అంబటిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16కుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ముఖ్యంగా పోలీసులను దుర్భాషలాడటం, విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ రిమాండ్ కోరారు.
పొన్నవోలు వాదన
సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అంబటికి ఈ కేసులతో సంబంధం లేదని, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకే రిమాండ్ విధించడం తగదని కోర్టును కోరారు.

అంబటిని ప్రశ్నించిన పోలీసులు

“సీఎంను ఎందుకు దూషించారు? దీని వెనుక ఎవరున్నారు?” అన్న కోణంలో పోలీసులు అంబటిని ప్రశ్నించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.

రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఘటనలు

ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. YCP నేత జోగి రమేష్ ఇంటిపై దాడి జరగడంతో పాటు, ఆయన ఇంటిని తగులబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి TDP నాయకత్వమే కారణమని YCP ఆరోపణలు చేస్తోంది.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దాడులు, అరెస్టులు, రిమాండ్ ఘటనలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
Read More
Next Story