
అంబటి పశ్చాత్తాపం చెందారు..వేధింపులు ఆపండి
కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి వేధించడానికి కాదని బొత్స మండిపడ్డారు.
క్షమాపణ చెప్పిన వ్యక్తిని వేధిస్తారా? అంటూ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై దాడులు జరిగినప్పుడు ఆయన ఆవేశంలో కొన్ని మాటలు అన్న మాట వాస్తవమే.. కానీ ఆ తర్వాత ఆయన విజ్ఞతతో తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన వ్యక్తిని ఇంకా వేధించడం ఏంటి? అని బొత్స ప్రశ్నించారు.
తల్లి ఎవరికైనా తల్లే.. ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
రాజకీయాల్లో మహిళలను లాగి మైలేజ్ పొందాలని చూడటం నీచమైన చర్య అని బొత్స మండిపడ్డారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు రికార్డుల్లో ఉన్నాయి. అంబటి తల్లిని తిడితే ఒక న్యాయం.. మీ తల్లిని అంటే మరొకటా? తల్లి ఎవరికైనా తల్లే. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం ఏ రకమైన రాజకీయం? అని ఆయన నిలదీశారు.
అధికారం ఇచ్చింది కేసులు పెట్టడానికా?
కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి వేధించడానికి కాదని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి. మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నా పట్టించుకోరా? ఇలాంటి అరాచకాలను వదిలేసి, రాజకీయ కక్షసాధింపులకే సమయం కేటాయిస్తున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. అంబటి రాంబాబును వేధిస్తున్న తీరుకు భవిష్యత్తులో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

