
అమరావతి చట్టబద్ధత ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమట
అమరావతి అన్‌స్టాపబుల్, అజరామరమని ఉద్ధండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు అన్నారు.
పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గురువారం రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్ధండరాయునిపాలెంలో సతీసమేతంగా పర్యటించిన ఆయన, అక్కడి రైతులు, మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది.. ఇకపై దీనిని ఎవరూ ఇంచ్ కూడా కదపలేరు అని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయం రాజధాని కోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన 29 వేల మంది రైతులకు అంకితమని భావోద్వేగంతో ప్రకటించారు.
జగన్ మూడు ముక్కలాటపై విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలు పన్ని అమరావతిని నాశనం చేయాలని చూసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ధ్వజమెత్తారు. జగన్ కొత్తగా మావిగన్ అనే పదం తెచ్చారు. డిక్షనరీ వెతికినా దాని అర్థం నాకు దొరకలేదు. అమరావతిని చంపాలనుకున్న వైసీపీకి ఎన్నటికీ జ్ఞానోదయం కలగదు అని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బిల్లుపై చర్చకు నిలబడలేక వాకౌట్ చేసిన వైసీపీని ప్రజలు రాజకీయంగా బ్లాకౌట్ చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, అండగా నిలిచిన పవన్
అమరావతి ప్రస్థానంలో ప్రతి అడుగులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలిచారని, ఏపీ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం అమరావతి ప్రాముఖ్యతను చాటుతోందన్నారు. అలాగే, రాజధాని కష్టకాలంలో ఉన్నప్పుడు ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అభివృద్ధి మంత్రం .. జాతికి అంకితం
అమరావతి ఇకపై అన్‌స్టాపబుల్ అని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా (బెస్ట్ సిటీ) తీర్చిదిద్ది దీనిని జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేవలం అమరావతి మాత్రమే కాకుండా విశాఖపట్నం, తిరుపతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని అమరావతి సాక్షిగా మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు జాతి గుండెకాయ అమరావతి. ఇది కేవలం నగరం కాదు.. ఆంధ్రుల ఆకాంక్షలకు చిహ్నం అని ఆయన పేర్కొన్నారు.
Next Story

