
'అమరావతి అజేయం, జగన్ రాజకీయానికి చరమగీతం!'
ఏపీ అసెంబ్లీలో నిప్పులు చెరిగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాదాపు 5 గంటల 36 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ, గత ఐదేళ్ల విధ్వంసంపై విశ్లేషణగానూ, భవిష్యత్ అభివృద్ధిపై భరోసాగానూ నిలిచింది. అయితే, ఈ చర్చా వేదిక కాస్తా గత పాలకుల తీరుపై నిప్పులు చెరిగే ఎన్నికల ప్రచార సభను తలపించింది.
జగన్ టార్గెట్‌గా 'మాటల తూటాలు'
సభకు గైర్హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అధికార పక్షం విరుచుకుపడింది. స్పీకర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ జగన్ పాలనను దుయ్యబట్టారు. జగన్‌ను "విధ్వంసకుడు, రాక్షసుడు, ఊసరవెల్లి" అని అభివర్ణిస్తూ ప్రసంగాలు సాగాయి. "మూడు ముక్కలాట" పేరుతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని వక్తలు మండిపడ్డారు.
గత ప్రభుత్వం అమరావతిని "స్మశానం, వేశ్యల నగరం, ఎడారి" అని అవహేళన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
అమరావతి మన అందరి ఊపిరి- చంద్రబాబు
తీర్మానంపై ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. "34 వేల ఎకరాల భూమిని 54 రోజుల్లో సేకరించడం ఒక చరిత్ర. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి. ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీగా దేశమే గర్వపడేలా తీర్చిదిద్దుతాం," అని ప్రకటించారు. 2028 ఆగస్టు నాటికి ప్రధానమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ₹56,000 కోట్లతో 91 పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్
"అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరు, అంగుళం కూడా కదల్చలేరు. ఎవరైనా జోక్యం చేసుకున్నా, శాపటైజ్ చేసినా అదే వారికి చివరి రోజు అవుతుంది" అని హెచ్చరించారు. రాష్ట్రంలో అమలయ్యేది అంబేడ్కర్ రాజ్యాంగమే తప్ప రాజారెడ్డి రాజ్యాంగం కాదన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని విరుచుకుపడ్డారు.
"దార్శనికుడికి, ఎన్నికల నాయకుడికి తేడా ఇదే"- పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, 2014లో చంద్రబాబుకు తాను ఎందుకు మద్దతు ఇచ్చానో వివరించారు. "ఒక రాజకీయ నేత తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ దార్శనికుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. చంద్రబాబు రెండో కోవకు చెందినవారు," అని కొనియాడారు. రాజధాని రైతులను వైసీపీ హయాంలో హింసించారని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు.
"వైసీపీ ఒక హానికర శక్తి"...
"జగన్ తన కోసం ప్యాలెస్‌లు కట్టుకున్నారు కానీ, ఉత్తరాంధ్రకు ఏం చేయలేదు. అమరావతి రైతులకు అబద్ధం చెప్పినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. జగన్ లేకపోయి ఉంటే రాష్ట్రానికి 50% పెట్టుబడులు వచ్చేవి" అని నారా లోకేష్ విమర్శించారు.
"రాష్ట్రానికి వైసీపీ హానికరమని ప్రజలు గుర్తించారు. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితికి జగన్ దిగజార్చారు" అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
అంతకు ముందు మాట్లాడిన అచ్చెన్నాయుడైతే ఓ రేంజ్ లో జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఓసందర్భంలో జగన్ పై వాడిన రెండు పదాలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
తీర్మానం ఏకగ్రీవ ఆమోదం...
మొత్తం 23 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 4.36 గంటల వరకు సాగింది. తీర్మానం ఆమోదం తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.
వాయిదా పడే నాటికి సభలో వివిధ పార్టీల బలాబలాలు.. టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8, వైసీపీ -11.
చివరగా, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది.
Next Story

