
రాజ్యసభలో ’అమరావతి‘ రణం.. వైసీపీ వాకౌట్
బిల్లుపై వైసీపీ అభ్యంతరాలు.. వైవీ సుబ్బారెడ్డి ధ్వజం
లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలో పాల్గొన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఈ బిల్లులో స్పష్టత లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్న ప్రత్యేక హోదా అంశం ఈ బిల్లులో ఎందుకు లేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. రాజధాని నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని గతంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం, ఇప్పుడు నేరుగా పార్లమెంటులో బిల్లు ఎలా ప్రవేశపెడుతుందని ఆయన ప్రశ్నించారు.
అమరావతి..అతిపెద్ద కుంభకోణం
అమరావతి నిర్మాణ వ్యయంపై వైవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చదరపు అడుగుకు రూ. 12 వేలకు పైగా వెచ్చిస్తున్నారని పేర్కొంటూ ఇది అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గత ఎనిమిదేళ్లలో అమరావతి కోసం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసినా, ఇప్పటివరకు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం రూ. 3.40 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇలాగే కొనసాగితే రాష్ట్రం రూ. 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోతుందని హెచ్చరించారు.
మూడు రాజధానుల వాదన
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే తాము మూడు రాజధానుల (విశాఖ ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్, అమరావతి లెజిస్లేటివ్) ప్రతిపాదన తెచ్చామని సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. అమరావతి వరదలతో మునిగిపోయే ప్రాంతమని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించినా వారికి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదని దుయ్యబట్టారు. ప్రస్తుత రూపంలోని బిల్లు ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ వైవీ సుబ్బారెడ్డి తన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story

