ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అమరావతిని (Amaravati)ని ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు. 12 ఏళ్లుగా సాగుతున్న అస్పష్టతకు ముగింపు పలకడానికి చేసిన మరో పెద్ద ప్రయత్నమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ప్రాధాన్యత లభించింది. అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపే నిర్ణయం, రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక మలుపుగా భావించాలి.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో రాజధాని ఎంపిక భావోద్వేగ అంశంగా మారింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి రైతుల నుంచి సుమారు 33 వేల ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే తరువాతి కాలంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి రావడం, అమరావతి అభివృద్ధి నిలిచిపోవడం, రైతుల నిరసనలు- ఇవన్నీ కలిసి ఈ సమస్యను కేవలం పరిపాలనా అంశం నుంచి సామాజిక, రాజకీయ సంక్షోభంగా మార్చాయి. ఈలోగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కి ఇచ్చిన గడువు 2024 జూన్ 2తో ముగిసింది. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం ఒకే రాజధాని వైపు అడుగులు వేయడం, గత కాలపు చేదు అనుభవాలకు ముగింపు పలకాలని నడుంకట్టింది.
ఈసారి ప్రభుత్వం వాదనలో ఒక స్పష్టత ఉంది. ఒకే రాజధాని ఉంటే పరిపాలన కేంద్రీకృతమై, నిర్ణయాలు వేగంగా అమలు కావచ్చని భావిస్తోంది. అంతేకాదు, అమరావతిని పూర్తిస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించవచ్చని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అది మద్దతు ఇస్తుందని ఆశిస్తోంది. ముఖ్యంగా, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే అంశం కూడా ఈ నిర్ణయానికి తావిస్తోంది. ఇది జరగాలంటే అసెంబ్లీ చేసే తీర్మానానికి కేంద్రం చట్టబద్ధత కల్పించాలి.
ఈ తీర్మానం తర్వాత ఏమి జరుగుతుంది?
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తూ అసెంబ్లీ మార్చి 28న తీర్మానం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానంతో రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. క్యాబినెట్ ఆమోదం, ఆ తర్వాత పార్లమెంటులో చర్చ, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి సవరణ చేపట్టవచ్చు. లేదా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కింద రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి అమరావతికి రాజధానిగా శాశ్వత హోదా కల్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు మారినా అమరావతినే శాశ్వత, చట్టబద్ధ రాజధానిగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలోని ఇతర సమస్యలకూ పరిష్కారం లభించవచ్చు.
కొత్తగా చట్టబద్ధత రావడం వల్ల రెండవ విడత భూ సమీకరణ (Phase-2 Land Pooling) కింద సుమారు 16,666 ఎకరాలు ప్రభుత్వ భూమి తో కలిపి 20,494ఎకరాల సమీకరణ ప్రక్రియ వేగవంతమవుతుంది.
విపక్షాలు ఏమంటున్నాయంటే...
అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి ఇప్పటికే చట్టబద్ధత ఉన్నప్పుడు అసెంబ్లీలో మళ్లీ తీర్మానం అవసరం ఏమిటని ప్రశ్నించారు. చట్టబద్ధత గురించి మాట్లాడాలంటే శాసన మండలి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతున్న సందర్భంగా రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 2024 జూన్ నుంచి రాజధానికి చట్టబద్ధత వచ్చేలా చూడాలని సిపిఎం డిమాండ్ చేసింది. కేంద్రం ఇప్పటికే 12 సంవత్సరాలు జాప్యం చేసిందని. ఇప్పుడైనా తీర్మానం చేయడం అవసరమేనని సీపీఎం అభిప్రాయపడింది.
2014లో రాజధాని పై ప్రత్యేకంగా కేంద్రీకరించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలని కారణంగా చివరకు దాని అస్తిత్వమే ప్రమాదంలో పడిన అనుభవం నుండి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఆచరణ సాధ్యం కాని మెగా ప్రాజెక్టులు, మాస్టర్ ప్లాన్లు చేపట్టి చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఆ భారాన్నంతా ప్రజలపై మోపటం సమ్మతం కాదని పేర్కొంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన 29 గ్రామాలనే క్యాపిటల్‌గా వేగంగా ఒకే దశలో రాజధానిని నిర్మించాలని కోరాయి. దాన్నే రాజధానిగా చట్టబద్ధం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు కేసు ఏమవుతుందీ?
రాజధానికి చట్టబద్ధత కల్పించాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోవాలి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసును ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే అమరావతి ముందుకు పోతుంది. లేదంటే కేంద్రం ఈసాకుతో మరోసారి వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దశ ముగిసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టమైన రాజధాని అవసరం మరింత అనివార్యం. అయితే అది ఒక్క అసెంబ్లీ తీర్మానంతోనే రాదు. కేంద్ర చట్టం లేదా స్పష్టమైన న్యాయ నిర్ణయం అవసరం.
ఇక్కడ ప్రధాన ప్రశ్న ఈసారైనా కేంద్రం స్పందిస్తుందా? అమరావతికి చట్టబద్ధ హోదా ఇవ్వడంలో ముందడుగు వేస్తుందా? అన్నదే. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా చెప్పిన ప్రత్యేక హోదాను ఈ ప్రభుత్వం ఇవ్వని విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.