
అమరావతి తీర్మానం ఒక ’పెద్ద డ్రామా‘
అవినీతి యజ్ఞానికి రాష్ట్రాన్ని సమిధని చేస్తారా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని పేరిట జరుగుతున్న భారీ అవినీతి నుంచి, రైతుల అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ’తీర్మానం ఎత్తుగడ‘ అని ఆయన విమర్శించారు. అసలు అమరావతికి ఎవరు అడ్డుపడ్డారని ఇప్పుడు తీర్మానం చేయాల్సి వచ్చిందో చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మండలిని ఎందుకు సమావేశపరచలేదు?
అమరావతిపై చంద్రబాబుకు అంత చిత్తశుద్ధి ఉంటే కేవలం అసెంబ్లీతోనే ఎందుకు సరిపెట్టారని సజ్జల ప్రశ్నించారు. అసెంబ్లీతో పాటు శాసనమండలిని కూడా సమావేశపరచాలి కదా? అక్కడ తమ అవినీతిని, అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు మండలిని పిలవడం లేదు అని ఆయన ధ్వజమెత్తారు. రాజధానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, దానిని కేవలం తన అవినీతికి ఒక శాశ్వత కామధేనువుగా మార్చుకున్నారని ఆరోపించారు.
అమరావతికి జగన్ వ్యతిరేకం కాదు..అవినీతికే మా అభ్యంతరం
అమరావతి ప్రాంతానికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సజ్జల స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి రాకముందే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మాకు అభ్యంతరం కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీ మీదనే అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కనీస మౌలిక సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు కావాలని, కానీ గత ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 5 వేల కోట్లేనని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ డిజైన్ల పేరిట రూ. 400 కోట్లు తగలేస్తున్నారని, పాత పనులకే మళ్ళీ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో గూడుపుఠానీ చేస్తున్నారని విమర్శించారు.
అప్పుల ఊబిలో రాష్ట్రం.. కమీషన్ల కోసమే
అమరావతి నిర్మాణాల పేరుతో తెస్తున్న అప్పులు, ఇస్తున్న అడ్వాన్స్‌లపై సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 9 వేల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ. 5 వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇచ్చేశారు. ఇదంతా కమీషన్ల కోసమే కదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు గతంలో వచ్చిన ఐటీ నోటీసులు కూడా అమరావతి కమీషన్లకు సంబంధించినవేనని, ఆయన పీఏ శ్రీనివాస్‌కు లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూనే వేల కోట్ల అప్పులు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న ఏకైక పని చంద్రబాబు ఇల్లు మాత్రమేనని సజ్జల ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? చెరువుల్లో ప్లాట్లు ఇచ్చి వారిని నట్టేటా ముంచారు. రాజధాని కనెక్టివిటీ కోసం ఏం చేశారు? ఇప్పటికీ ఆ కరకట్ట రోడ్డే కదా గతి అని నిలదీశారు. వెస్ట్రన్ బైపాస్ పూర్తి చేసింది వైఎస్సార్‌సీపీ హయాంలోనేనని ఆయన గుర్తు చేశారు. భౌతికమైన పనుల కంటే ప్రజలను భ్రమల్లో ఉంచడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శించారు.
హైపర్ లూప్ ఏమైంది? ఒలింపిక్స్ ఏమయ్యాయి?
చంద్రబాబు గతంలో చెప్పిన కట్టుకథలను సజ్జల ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో హైపర్ లూప్ అన్నారు.. అమరావతిలో ఒలింపిక్స్ అన్నారు.. అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు మళ్ళీ కొత్త భ్రమలు కల్పిస్తున్నారు. ఆ భవనాల మెయింటెనెన్స్ ఖర్చు వింటేనే ప్రజల గుండెలు అదిరిపోతున్నాయి అని అన్నారు. వాస్తవిక దృక్పథం లేకుండా కేవలం గ్రాఫిక్స్‌తో కాలక్షేపం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారదర్శకత ఎక్కడ?
అమరావతి పనులపై ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఎక్కడా పారదర్శకత లేదని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వివరాలను బయటపెట్టాలని, లేదంటే ప్రజలే చంద్రబాబు అవినీతి యజ్ఞాన్ని అడ్డుకుంటారని హెచ్చరించారు.
Next Story

