
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు గ్రహణం వీడిందా? అసలేమిటీ 'దారి'?
ఏపీ మ్యాప్ లోకి అమరావతి చేరింది. మరి ఇప్పుడైనా ఇన్నర్ వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 'మణిహారం'గా అభివర్ణించే ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టు వ్యవహారం ప్రస్తుతం ఒక అడుగు ముందుకీ రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కీలకమైన ఈ రింగ్ రోడ్డు నిర్మించకపోతే, లోపల నిర్మించే 7 ప్రధాన అంతర్గత రహదారులకు అర్థమే ఉండదు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం అనుకున్నంత సులభం కాదు. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ చిక్కుముళ్లు అనేకం ఉన్నాయి.
అసలేమిటీ ఇన్నర్ రింగ్ రోడ్డు?
అమరావతి కోర్ క్యాపిటల్ (Seed Capital) చుట్టూ 97.5 కిలోమీటర్ల పొడవున, 8 నుండి 12 వరుసలతో నిర్మించే యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇది. రాజధానిలోని 29 గ్రామాలతో పాటు అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ, విజయవాడ-గుంటూరు నగరాలకు బైపాస్‌గా ఇది పనిచేస్తుంది. సుమారు ₹25,000 కోట్ల భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు.
ఏయే ఊళ్ల మీదుగా సాగుతుందంటే..
అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, జి. కొండూరు, గన్నవరం, విజయవాడ రూరల్, కాచవరం, వైకుంఠపురం, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, నూతక్కి, చోడవరం, పెనమలూరు, నిడమానూరు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి వద్ద ముగుస్తుంది.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ రెండు దశల్లో నిర్మించాలన్నది ప్లాన్. మొదటి దశలో 67.57 కి.మీ. ఈ దశ 28 గ్రామాల మీదుగా సాగుతుంది. అవి- కేతనకొండ, కొటికలపూడి, దాములూరు, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్డమాను, ఎండ్రాయి, అనంతవరం, కర్లపూడి, మోతడక, పెదపరిమి, తాడికొండ, కంతేరు, కాజా, చినకాకాని, పెదవడ్లపూడి, తుమ్మపూడి, నూతక్కి, రామచంద్రపురం, చోడవరం, పెనమలూరు, గంగూరు, పొరంకి, నిడమానూరు, ఆతుకూరు, సవరగూడెం, వెదురు పావులూరు.
రెండో దశ 28.68 కి.మీ. ఈ రోడ్డు వెదురు పావులూరు, రామచంద్రపురం, నున్న, పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు, కవులూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, త్రిలోచనపురం, నవి పోతవరం, జామి మాచవరం, కేతనకొండ.
ఆగిపోవడానికి అసలు కారణాలేమిటి?
2019-2024 మధ్య కాలంలో 'మూడు రాజధానుల' ప్రతిపాదన వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. రాజధాని ఉనికే ప్రశ్నార్థకమైన వేళ, వేల కోట్ల వ్యయంతో కూడిన రింగ్ రోడ్డు అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది.
అలైన్‌మెంట్ వివాదం మొదలైంది. కోర్టులో కేసులు దాఖలయ్యాయి. అలైన్‌మెంట్ మార్పులపై ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు కావడంతో ఫైళ్లు కోర్టుల చుట్టూ తిరిగాయి. ఇటీవల హైకోర్టు ఈ కేసులను కొట్టివేయడంతో న్యాయపరమైన అడ్డంకులు తొలిగినా, సమయం మాత్రం వృథా అయింది.
చట్టబద్ధత - గెజిట్ బలం..
పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా అమరావతిపై జరిగిన చర్చలు, తదనంతరం వెలువడబోయే కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతికి ఇప్పుడు తిరుగులేని చట్టబద్ధత వస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఇది శాశ్వత రాజధానిగా ఖరారవుతుంది.
ముందున్న సవాళ్లు: భూమి, నిధులు
ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి భూసేకరణ. ఈ రోడ్డు కోసం సుమారు 17,000 ఎకరాల భూమి అవసరమని అంచనా. మొదటి విడతలో (ల్యాండ్ పూలింగ్) భూములిచ్చిన రైతుల సమస్యలే ఇంకా పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో, రెండో విడత కింద మళ్లీ భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు.
భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం మళ్లీ 'ల్యాండ్ పూలింగ్' లేదా 'ప్లాట్ల అభివృద్ధి' మంత్రాన్ని జపిస్తోంది. కానీ, ప్రభుత్వంపై ఉన్న 'విశ్వాసరాహిత్యం' భూసేకరణకు పెద్ద ఆటంకంగా మారింది. రెండో విడత సేకరించే భూమితో ఇన్నర్ రింగు రోడ్డు, రెండో విడత భూమి ఇచ్చే రైతులకు ప్లాట్లు, మిగిలిన భూమితో అంతర్జాతీయ స్థాయి విమానం నిర్మించాలన్నది సర్కార్ భావన.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సాధ్యం కావాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సరిపోదు. రైతులు, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం.
రైతులతో రాజీ..
బలవంతపు భూసేకరణ కాకుండా, రైతులకు నమ్మకం కలిగించి వారిని భాగస్వాములను చేస్తేనే పనులు వేగవంతం అవుతాయి. అత్యాధునిక డ్రోన్ సర్వేలు, రీ-డిజైనింగ్ పనులు జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో భూమి సేకరించి, నిధులు సమకూర్చుకుని వచ్చే 3-4 ఏళ్లలో దీనిని పూర్తి చేయడం ప్రభుత్వానికి ఒక 'అగ్నిపరీక్ష' వంటిదే. ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక పరీక్షా కేంద్రం. రీ-డిజైనింగ్ పేరుతో కాలయాపన చేయకుండా, ఒక నిర్దిష్టమైన గడువు పెట్టుకుని పనులు మొదలుపెడితేనే ఇది "మ్యాప్" నుంచి "నేల" మీదకు దిగి వస్తుంది.
Next Story

