
'సామ్నా' పత్రికలో ప్రచురితమైన ఫోటో (సామ్నా సౌజన్యంతో)
అమరావతి బిల్లు ముంబైకి ముప్పని 'సామ్నా' ఎందుకన్నదీ?
శివసేన పత్రిక 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో ఏం రాశారంటే..'ఇప్పుడు లోక్‌సభలో అమరావతిపై నిర్ణయం జరిగింది, కానీ ప్రమాద ఘంటికలు మాత్రం ముంబైలో మోగుతున్నాయి'
ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించింది. ఆ బిల్లు ఇప్పుడు మహారాష్ట్రలో మంటలు రేపుతోంది. అమరావతికి చట్టబద్ధతకి సంబంధించి శివసేనకు చెందిన పత్రిక సామ్నాలో వచ్చిన సంపాదకీయం తెలుగు పాఠకుల కోసం యధాతథంగా..
సామ్నా పత్రిక సంపాదకీయ పేజీ (సామ్నా సౌజన్యంతో)
ఏప్రిల్ 1న లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2026 ఆమోదం పొందింది. రాజ్యసభలో కూడా సాధకబాధకాలపై చర్చలు జరిపి 'అమరావతి'కి ముద్ర వేశారు. మెజారిటీ సంఖ్య బలంగా ఉండటంతో బిల్లు ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురవుతుందనే భయం లేదు. పైగా 'మెంబర్' మండలి గొర్రెల మాదిరిగా అమ్ముడుపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటంతో, హోల్‌సేల్‌గా మెజారిటీని అన్ని స్థాయిలలో కొనుగోలు చేస్తారు.
'అమరావతి'కి సంబంధించిన బిల్లు కూడా వాయిస్ ఓటుతో 'అవును అనే మెజారిటీ' అన్న నినాదాల మధ్య ఆమోదం పొందింది. అయినప్పటికీ, అమరావతి విషయాన్ని మహారాష్ట్ర తీవ్రంగా పరిగణించాలి. ఆంధ్ర రాజధాని విషయం కదా అని దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ బిల్లు వల్ల 'అమరావతి'కి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు లభించనుంది.
ఇప్పుడు ఆంధ్ర రాజధాని అమరావతికి, మహారాష్ట్ర రాజధాని ముంబైకి సంబంధం ఏమిటి? అనవసరంగా కాళ్లలో కాళ్లు పెట్టి ఎందుకు వివాదాన్ని సృష్టిస్తారు? అని బీజేపీలోని తెలివైన వారు అడగవచ్చు. దానికి శ్రీ అనిల్ షిదోర్ ఒక హెచ్చరికను ముందుకు తెచ్చారు. అది మరాఠీ ప్రజలందరికీ ప్రమాద ఘంటిక అని చెప్పాలి. షిదోర్ అభిప్రాయం ప్రకారం, అమరావతి రాజధాని విషయం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిందే అయినా, మరాఠీ మనిషి దానిని జాగ్రత్తగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉంటుందని, అందులో ఎప్పుడూ ఎలాంటి మార్పు ఉండదని తెలిపే బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
భారత రాజ్యాంగంలోని అధికరణ- 3 ప్రకారం.. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు మార్చడం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వంటి అధికారాలు మాత్రమే లోక్‌సభకు ఉన్నాయి. కానీ రాష్ట్ర రాజధాని ఏది ఉండాలి అని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఇవ్వలేదు. ఆ విషయం, అధికారం రాష్ట్రాలకే వదిలేశారు. అయినప్పటికీ అమరావతికి సంబంధించిన బిల్లును పార్లమెంటులోకి చొప్పించి ఆమోదించారు.
ఈ కుతంత్రాన్ని మరాఠీ ప్రజలు గుర్తించాలి. ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అనే సొరంగం నుండి 'షా అండ్ మోదీ కంపెనీ' ముంబైలోకి ప్రవేశించవచ్చు. లోక్‌సభ - రాజ్యసభలో ఏదో ఒక బిల్లును మన ముంబై విషయంలో కూడా తీసుకువచ్చి, ముంబైని 'జాతీయ ఆర్థిక మండలి'గా ప్రకటించవచ్చు. అదే బిల్లులో ముంబై ఆర్థిక లావాదేవీలను, ఆర్థిక సామర్థ్యాన్ని నోరారా కొనియాడి, ముంబై ఎంతటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నగరం అని పొగుడుతూ, ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే బాంబు పేలుస్తారు.
ఈ ప్రకటన తర్వాత ఫడ్నవీస్ భాయ్, మింధే భాయ్, సునేత్రా బెన్, రీతూ బెన్ మొదలైన వారు 'ఇది ముంబైకి దక్కిన గౌరవం' అని చెబుతూ వేడుకలు చేసుకుంటారు. ఈ 'భాయ్', 'బెన్' ప్రజలందరికీ ఇప్పుడు మహారాష్ట్ర రాజధానిగా ముంబైపై అనురాగం మిగిలి లేదు. ముంబైని ఇలా కేంద్రానికి బానిసగా చేసి, ఏదైనా రెండో, మూడో లేదా నాలుగో ముంబైకి మహారాష్ట్ర రాజధాని హోదా కల్పించే ప్రయత్నం జరుగుతుందనే భయం 'అమరావతి' ఉదంతం తర్వాత మా లాంటి వారిని వేధిస్తోంది.
ముంబై ఆర్థిక నరాలు ఇప్పటికే పరాయి వారి చేతుల్లోకి వెళ్లాయి. రాజకీయ పైజామా నాడాలు కూడా ఎవరి చేతుల్లోనో కనిపిస్తున్నాయి. ముంబై మహారాష్ట్ర రాజధానిగా ఏర్పడింది బీజేపీ-మింధే ప్రోత్సహించిన ఖరాత్ బాబా నల్లమందు విద్య వల్ల కాదు. 106 మంది మరాఠీ వీరుల త్యాగం వల్ల ముంబై మహారాష్ట్రకు దక్కింది. ఆ ముంబైపై ధనికుల, సేఠ్‌ల ప్రభావం అప్పుడూ ఉండేది, కానీ మహారాష్ట్ర పాలకులు, శివసేన వంటి తీవ్రవాద సంస్థలు ఆ ధనిక వర్గాలను తమ అదుపులో ఉంచాయి. 'మీ ధందాలు, వ్యాపారాలు చేసుకోండి, సుఖంగా ఇక్కడే బతకండి. కానీ డబ్బు బలంతో మా వీరత్వాన్ని కొనాలని చూస్తే ఖబడ్దార్' అని గట్టిగా చెప్పే ధైర్యం అప్పటి పాలకులకు ఉండేది. అటువంటి ధైర్యం నేటి మింధే పాలకులలో రవ్వంతైనా ఉందా? హంబీర్ రావు మోహితే ఛత్రపతి శివారాయల సర్వసేనాధిపతి. ఆయన కుమార్తె మహారాణి తారాబాయిని 'మతమార్పిడి' చేసి జైనులుగా మార్చే ప్రయత్నం జరిగినా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఇటువంటి బలహీనమైన, మందబుద్ధి పాలకుల అండతోనే ముంబై ముక్కను మహారాష్ట్ర నుండి వేరు చేస్తారు. భయం ఇక్కడే ఉంది.
ఆంధ్ర విభజన జరిగి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది. పాత ఆంధ్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణకు దక్కింది. అందువల్ల కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 'అమరావతి' ఆంధ్ర కొత్త రాజధాని అని ప్రకటించారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్రం వందల కోట్లు ఇచ్చినా 'అమరావతి' మాత్రం రూపుదిద్దుకుంటున్నట్టు కనిపించడం లేదు. దానికి కారణం అక్కడి రాజకీయ నాయకులకే తెలియాలి. పరిపాలనా భవనాల అస్థిపంజరాలు నిలబడ్డాయి, ఆ అస్థిపంజరాలలో ఇప్పుడు దయ్యాలు, భూతాలు నివసిస్తున్నాయని భయంకరమైన కథలు కూడా ప్రచారమయ్యాయి.
చివరికి ఇప్పుడు ఒక బిల్లును పార్లమెంటుకు తీసుకువచ్చి 'అమరావతి'యే ఆంధ్ర రాజధాని అని ఆమోదం పొందారు. అమరావతిని రాజధానిగా మార్చేందుకు వేల ఎకరాల భూమిని సేకరించారు. రైతులు తమ సారవంతమైన భూములను ఆ పని కోసం ఇచ్చారు. కేంద్రం డబ్బు మీద డబ్బు ఇచ్చింది, కానీ రాజధాని గుర్రం మాత్రం ముందుకు వెళ్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పుడు లోక్‌సభలో అమరావతిపై నిర్ణయం జరిగింది, కానీ ప్రమాద గంటలు మాత్రం ముంబైలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే మన పాలకులలో మహారాష్ట్ర స్వాభిమానం రవంతైనా మిగిలి లేదు. మహారాష్ట్రకు చెందిన రావుసాహెబ్‌లు, భౌసాహెబ్‌లు, తాయీసాహెబ్‌లు మొదలైన వారంతా రావుభాయ్‌లు, తాయీబెన్‌లుగా మారిపోయిన ఫలితమే దీనికి కారణం.
(గమనిక- ఇది సామ్నా పత్రికలోని మరాఠీ సంపాదకీయానికి తెలుగు అనువాదం. ఇది ఫెడరల్ సొంతం కాదు. తెలుగు పాఠకుల అవగాహన కోసం)
Next Story

