ఆధ్యంతం అబద్ధాలే : వైఎస్సార్సీపీ సభ్యులు
x

ఆధ్యంతం అబద్ధాలే : వైఎస్సార్సీపీ సభ్యులు

గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని, ఈ ప్రసంగం ఆద్యంతం అబద్ధాల పుట్ట అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తామనే భయంతోనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వారు ధ్వజమెత్తారు.

గవర్నర్‌తో అసత్యాలు పలికించడం బాధాకరం

గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరుత్సాహపరిచిందని, గత బడ్జెట్‌లో చెప్పిన అబద్ధాలనే మళ్ళీ వల్లె వేయించారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరి జేబులు నింపారు? అని వారు ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని, మహిళా సాధికారత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నా.. గవర్నర్ ప్రసంగంలో ఆ వాస్తవాలను ఎందుకు పొందుపరచలేదని నిలదీశారు.

రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తోంది

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ భూముల దోపిడీపై ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, మాజీ మంత్రుల ఇళ్ళపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గవర్నర్ కనీసం సరిచూసుకోకుండా చదివారని, ఇదంతా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమని విమర్శించారు.

ఉద్యోగులు, వాలంటీర్లకు తీరని వంచన

ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని, బకాయిలు చెల్లించకుండా వేధిస్తోందని మండిపడ్డారు. వాలంటీర్లకు హామీలిచ్చి రోడ్డున పడేశారని, నిరుద్యోగ భృతి విషయంలో యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఘోరమైన పరిస్థితులపై గవర్నర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదా మా హక్కు

ప్రతిపక్ష హోదా అనేది వైఎస్సార్‌సీపీ హక్కు అని, దానిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా మారిపోయింది. దేవుళ్ళను కూడా మోసం చేసే స్థాయికి వెళ్ళారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి, డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు అని విమర్శించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతామని, ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని నేతలు హెచ్చరించారు.

Read More
Next Story