
ఎన్‌సీపీ విలీన ప్రకటనకు బ్రేక్..
“దురదృష్టవశాత్తు అజిత్ విమాన ప్రమాదంతో విలీన చర్చలు నిలిచిపోయాయి. రెండు వర్గాలు కలిసి రావాలన్నదే మా కోరిక” - శరద్ పవార్..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లోని రెండు వర్గాల విలీనంపై సాగుతున్న చర్చలు నిలిచిపోయాయని పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్(Sharat pawar) తెలిపారు. అజిత్ పవార్(Ajit pawar) వర్గం విలీనంపై ఆసక్తి చూపడం లేదని ఆయన చెప్పారు. ఈ చర్చలు గత నాలుగు నెలలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న రెండు వర్గాల విలీనాన్ని ప్రకటించాల్సి ఉందని ముందుగా నిర్ణయించారని శరద్ పవార్ తెలిపారు. అయితే అజిత్ పవార్ మరణం తర్వాత ఈ చర్చలు ఆగిపోయాయని శనివారం (జనవరి 31) విలేకరులతో చెప్పారు.
‘కలిసిపోవాలనుకున్నాం..కాని’
“దురదృష్టవశాత్తు అజిత్ పవార్ విమాన ప్రమాదం వల్ల విలీన చర్చలు నిలిచిపోయాయి. రెండు వర్గాలు కలిసి రావాలని మా కోరిక” అని శరద్ పవార్ అన్నారు.
నాయకత్వ సంక్షోభ భయంతోనే అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడంపై త్వరగా నిర్ణయం తీసుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బలమైన నాయకత్వం లేకపోతే పార్టీ దూరమవుతుందన్న ఆందోళన, అలాగే మరో వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“ఎన్‌సిపికి బాధ్యత వహించే నాయకుడు అవసరమనే భావన ఉండవచ్చు. అందుకే ఈ తాజా పరిణామం చోటుచేసుకుని ఉండొచ్చు” అని శరద్ పవార్ అన్నారు.
అజిత్ పవార్ ఫిబ్రవరి 12ను తాత్కాలిక విలీన తేదీగా ప్రతిపాదించారని శరద్ పవార్ తెలిపారు. ఈ చర్చల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. “అజిత్ పవార్ సమర్థవంతమైన నాయకుడు” అని పేర్కొన్నారు శరత్ పవార్.
విలీన చర్చల్లో తన పాత్రపై ప్రశ్నించగా.. “నేను నేరుగా చర్చల్లో పాల్గొనలేదు. అవి మా వర్గం తరఫున జయంత్ పాటిల్, మరోవైపు అజిత్ పవార్ మధ్య జరిగాయి” అని తెలిపారు.
సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం తొందరపాటు నిర్ణయామా? అన్న ప్రశ్నకు “అంత తొందర ఉందో లేదో నాకు తెలియదు. ఆ డిమాండ్ వారి పార్టీలో నుంచే వచ్చి ఉండవచ్చు” అని అన్నారు.
2023 జూలైలో ఎన్‌సీపీలోని 54 మంది ఎమ్మెల్యేలలో 40 మందికి పైగా అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. దీంతో పార్టీ చీలిపోయింది. అనంతరం శరద్ పవార్ తన వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్’ అని పేరు పెట్టారు.
పూణే, పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు కొంతకాలం కలిసి పనిచేశాయి. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. బీజేపీ రెండు పౌర సంస్థల్లోనూ స్పష్టమైన విజయం సాధించింది.

