
ఎవరు ఎక్కడి నుంచో నాలుగు రోజుల్లో చెప్తాం: AIADMK
బీజేపీతో పాటు ఇతర మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై చర్చలు పూర్తయ్యాయన్న ఎడప్పడి పళనిస్వామి
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ సీట్ల పంపకం ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో నాలుగు రోజుల్లో నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి తెలిపారు. బీజేపీతో పాటు ఇతర మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై చర్చలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందని వెల్లడించారు. ఈ చర్చల్లో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.
“మరికొన్ని రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తాం. గెలిచే అవకాశాలు ఉన్న మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడమే మా లక్ష్యం” అని చెన్నై బయలుదేరే ముందు పళనిస్వామి మీడియాతో అన్నారు. డీఎంకే కూటమిలోలాగా విభేదాలు తమ వద్ద లేవని కూడా పేర్కొన్నారు.
సీట్ల పంపకం చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ నాయకుడు పియూష్ గోయల్ శనివారం తమిళనాడుకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అమిత్ షాతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు.
విజయ్‌కు నో ఎంట్రీ..
ఇక నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కూటమి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను పళనిస్వామి ఖండించారు. తాము టీవీకేతో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. అలాగే ఇకపై కొత్త పార్టీలను ఎన్డీయే కూటమిలో చేర్చే అవకాశం లేదని వెల్లడించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పథకాలపై కూడా పళనిస్వామి విమర్శలు చేశారు. మరోవైపు నటి నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ, ఆ అంశం ముగిసిపోయిందని, ఇక దానిపై చర్చ అవసరం లేదని అన్నారు.
మొత్తంగా తమిళనాడు ఎన్నికల దృష్ట్యా అన్నాడీఎంకే కూటమి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే పూర్తి సీట్ల జాబితా విడుదల కానుంది.

