
తమిళనాడు ఎన్నికలు: 170 స్థానాల్లో ఏఐఏడీఎంకే పోటీ?
త్వరలో చెన్నైకి బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జి పీయూష్ గోయల్ ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే సుమారు 170 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో స్వతంత్రంగా మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ వ్యూహం రూపొందించినట్లు సమాచారం.
234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ కోసం 118 స్థానాలు అవసరం. అయితే ఎన్డీఏ కూటమి మొత్తం 210 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి 20, పీఎంకేకు 17..
ఇక బీజేపీ సుమారు 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పీఎంకేకు సుమారు 17 స్థానాలు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇటీవల కూటమిలో చేరిన ఏఎంఎంకేకు 9 స్థానాలు ఇవ్వవచ్చని సమాచారం. జీకే వాసన్ నేతృత్వంలోని టీఎంసీకి 3 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. చిన్న పార్టీల విషయానికొస్తే, అవి ఏఐఏడీఎంకే ‘రెండు ఆకులు’ గుర్తుపై లేదా బీజేపీ ‘కమలం’ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంది.
అమిత్ షా నేతృత్వంలో చర్చలు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సీట్ల పంపకం చర్చలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామితో తొలి విడత చర్చలు పూర్తయ్యాయి. ఢిల్లీలో పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌లతో అమిత్ షా వేర్వేరుగా సమావేశమయ్యారు. కూటమి రూపురేఖలను ఖరారు చేసే పనిలో ఈ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జి పీయూష్ గోయల్ త్వరలో చెన్నైకి వెళ్లనున్నారు.
2021 ఎన్నికల ఫలితాలు..
గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 179 స్థానాల్లో పోటీ చేసి 66 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించింది. పీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత పార్టీ లోపల విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం అన్బుమణి రామదాస్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు ఎస్. రామదాస్ వి.కె. శశికళతో కలిసి పనిచేస్తున్నారు.

