
టీవీకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పళనిస్వామి..
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఊహాగానాలకు తెర..
తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఇ. ఫళని స్వామి స్పష్టం చేశారు.
మార్చి 14న మీడియా సంస్థ “చాణక్య”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీవీకేతో తమ పార్టీ ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు. “మేము ఇప్పటివరకు ఆ పార్టీతో ఎలాంటి చర్చలు జరపలేదు. చర్చలు లేకపోతే కూటమి ఎలా ఏర్పడుతుంది? మీడియా అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తోంది” అని పేర్కొన్నారు.
ఎన్డీఏలో అన్నాడీఎంకే పాత్ర..
తమిళనాడులో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కూటమికి అన్నాడీఎంకేనే నాయకత్వం వహిస్తుందని పళనిస్వామి పేర్కొన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో విభేదాలు ఉన్నాయన్న వార్తలను కూడా ఖండించారు.
‘అన్నామలై కూడా వస్తారు..’
మార్చి 17న కోయంబత్తూరులో జరిగే నిరసన కార్యక్రమానికి అన్నామలై కూడా సహాధ్యక్షత వహించనున్నారని ఆయన తెలిపారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీతో ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారమయ్యాయని, ఎన్నికల్లో కలిసి పనిచేసే అవకాశముందని చెప్పారు.
‘ఆ అవకాశమే లేదు..’
AIADMKతో పొత్తు విషయమై టీవీకే కూడా స్పష్టతనిచ్చింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పారు.
బీజేపీతో చర్చలపై ఊహాగానాలు..
అయితే బీజేపీ మాత్రం విజయ్‌తో చర్చలు జరుపుతోందని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పొత్తు కుదిరితే.. ఎన్నికల్లో విజయం సాధించాక విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే సీట్ల పంపకాలలో భాగంగా టీవీకేకు సుమారు 80 స్థానాలు ఇస్తామని ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి పదవిపై విజయ్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
విజయ్ ఫ్యాన్స్‌పై బీజేపీ గురి..
విజయ్‌కు తమిళనాడులో భారీ అభిమాన వర్గం ఉంది. ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు కూడా అనేక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే విజయ్‌ను బీజేపీ తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
టీవీకేలో అంతర్గత చర్చ..
ఇదిలా ఉండగా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టం జరుగుతోందని టీవీకే అంతర్గత వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విజయ్ తనను స్వతంత్ర ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఆయన డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా, బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పేర్కొన్నాడు. అలాగే సామాజిక సంస్కర్త పెరియార్ రామసామి ఆలోచనలకు తాను అనుచరుడినని కూడా పలుమార్లు చెప్పారు.
మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ముందు కూటములపై జరుగుతున్న ఊహాగానాలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

