
‘అజిత్‌కు కేటాయించిన శాఖలు అలాగే ఉంచాలి’
ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్‌సీపీ నేతలు..
మహారాష్ట్ర(Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన చేపట్టిన శాఖలను అలాగే ఉంచాలని ఎన్‌సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ శుక్రవారం (జనవరి 30) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis)ను కలిశారు. అనంతరం ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ స్థానాన్ని వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఎన్‌సీపీలో నాయకత్వ శూన్యత ఏర్పడిందని, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పార్టీ భవిష్యత్తుపై సునేత్రా పవార్‌తో పాటు కుటుంబ సభ్యులతో పటేల్ చర్చిస్తామని తెలిపారు. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని మరో వర్గంతో ఎన్‌సీపీ విలీనం జరగవచ్చన్న ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రెండు వర్గాల పునరేకీకరణపై చర్చలు ఒక దశకు చేరుకున్నాయని శరద్ పవార్ శిబిరానికి చెందిన నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం (ఫిబ్రవరి 1) ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్‌ను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడిపై శనివారం (జనవరి 31) నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

