
పది సెకన్లకే వాయిదా.. అసెంబ్లీ రోడ్డుపై బైఠాయింపు
లడ్డూ సెగతో అట్టుడుకుతున్న మండలి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా తిరుమల లడ్డూ ప్రసాదం అంశం చిచ్చురేపింది. శుక్రవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వివాదం కారణంగా సభ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడింది. లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడి పలాయనం చిత్తగిస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో, రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు.
పది సెకన్లకే వాయిదా.. గందరగోళం
శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో ఉద్రిక్తత మొదలైంది. నిన్నటి లఘు చర్చలో ప్రభుత్వం తప్పుడు పత్రం ఇచ్చిందని ఛైర్మన్ ప్రకటించడంపై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన పది సెకన్లకే.. సభను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఛైర్మన్ వెళ్ళిపోవడంతో కూటమి సభ్యులు కూడా విస్మయానికి గురయ్యారు.
వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
సభ వెలుపల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కుంభారవి, అరుణ్ కుమార్, అప్పిరెడ్డి మీడియా పాయింట్‌లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేశారు. రూ. 350 ఉన్న నెయ్యిని రూ. 650కి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. ఇందాపూర్, వైష్ణవి సంస్థల ముసుగులో హెరిటేజ్‌కు కోట్లాది రూపాయలు దోచిపెట్టేందుకే ఈ కుట్ర అని వారు ఆరోపించారు. సీబీఐ నివేదికతో చంద్రబాబు సర్కార్ డిఫెన్స్‌లో పడిందని, అందుకే చర్చకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఏసీ బాయ్‌కాట్.. రోడ్డుపై నిరసన:
లడ్డూ ప్రసాదంపై చర్చ జరపడం లేదన్న నిరసనతో వైఎస్సార్‌సీపీ సభ్యులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అసెంబ్లీ బయట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వంపై నినాదాలు చేశారు. దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు భక్తులకు క్షమాపణ చెప్పాలి.. హెరిటేజ్‌పై సీబీఐ విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. చర్చ జరగకుండా కేవలం స్టేట్‌మెంట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం తలదించుకునేలా..
కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని, ఎమ్మెల్సీల అభిప్రాయాలను వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరోవైపు, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని కూటమి మంత్రులు ఆరోపించారు.
Next Story

