
రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దాను తొలగించాలని AAP లేఖ..
ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఆప్ డిప్యూటీ లీడర్‌గా ఉన్న ఎంపీ రాఘవ్ చద్దాను పదవి నుంచి తప్పించాలని కోరుతూ సచివాలయానికి లేఖ రాసింది. సభలో మాట్లాడేందుకు ఆయనకు సమయం కేటాయించవద్దని లేఖలో కోరింది. చద్దా స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పార్టీకి చద్దా దూరమవుతున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం రాజ్యసభలో ఆప్‌కు మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుంచి, ముగ్గురు ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇంతకు కారణాలేంటి?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బయట పడ్డారు. వారి విడుదలపై చద్దా స్పందించకపోవడం, సోషల్ మీడియాలో కూడా ఏ ప్రకటన చేయకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు కారణాలు పార్టీతో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చాయి.
అలాగే, పార్టీ కార్యాలయంలో కేజ్రివాల్ నిర్వహించిన కీలక విలేఖరుల సమావేశానికి హాజరుకాలేదు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘జన్ సభ’లోనూ చద్దా కనిపించలేదు.
2012లో పార్టీలోకి..
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చద్దా, 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. కేజ్రివాల్‌కు సన్నిహితుడిగా పేరున్న చద్దా.. పార్టీ జాతీయ కోశాధికారిగా సేవలందించడమే కాకుండా, కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. గతంలో ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్‌గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ పంజాబ్ కో ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజ్యసభకు ఎంపికయిన చద్దా.. ఎగువ సభలో అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు.

