లోక్‌సభలో గందరగోళం - 8 మంది ఎంపీల సస్పెన్షన్..
x

లోక్‌సభలో గందరగోళం - 8 మంది ఎంపీల సస్పెన్షన్..

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ..


Click the Play button to hear this message in audio format

లోక్‌సభ(Lok sabha)లో గాల్వాన్‌ ఘర్షణ అంశం మళ్లీ ప్రస్తావనకు రావడంతో మంగళవారం సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రాసిన ప్రచురించని జ్ఞాపకాల పుస్తకంలో గాల్వాన్‌ ఘటనకు సంబంధించిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తావించడానికి ప్రయత్నించగా, బీజేపీ(BJP) సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో పలుమార్లు గందరగోళం ఏర్పడి, సమావేశాలు వాయిదా పడ్డాయి.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన గాల్వాన్‌ లోయలో 2020లో జరిగిన భారత్–చైనా సరిహద్దు ఘర్షణను ప్రస్తావిస్తూ ప్రభుత్వం స్పందనపై ప్రశ్నలు లేవనెత్తాలని ప్రయత్నించారు. అయితే స్పీకర్‌ ఇచ్చిన గత తీర్పును ఉటంకిస్తూ అధికార పార్టీ సభ్యులు ఆయన వ్యాఖ్యలను ఆపాలని కోరారు. రాహుల్ గాంధీ తనకు మాట్లాడే హక్కు ఉందని, తాను ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. “నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ మాటలతో సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. తూర్పు లడఖ్‌లో జరిగిన సంఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేస్తూ, ఆ ఘటనపై పూర్తి వివరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించగా, సభలో హోరాహోరీ నినాదాలు వినిపించాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.

సభ వాయిదా అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆయన భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని, అందుకే పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.

అంతేకాక, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాహుల్ ఆరోపించారు. “ప్రతిపక్ష స్వరాన్ని అణచివేస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కూడా పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాలు ప్రధానమంత్రిపై ఒత్తిడిని పెంచుతున్నాయని, ఆ ఒత్తిడే ఇటీవలి నిర్ణయాల్లో కనిపిస్తోందని అన్నారు.

ఇదే సమయంలో సభలో జరిగిన గందరగోళానికి సంబంధించి స్పీకర్ కఠిన చర్యలు తీసుకున్నారు. సభలో ప్రవర్తన సరిగా లేదని, నినాదాలు, కాగితాలు చించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ పడోల్, డీన్ కురియకోస్ సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టగా, సభ వాయిస్ ఓటుతో ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల మిగిలిన కాలానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు.

ఈ నిర్ణయంపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు భవనం వెలుపల నిరసన చేపట్టారు. తమ పార్టీ సభ్యులను అన్యాయంగా సస్పెండ్ చేశారని, ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. సభలో ప్రశ్నలు అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష బాధ్యత అని వారు పేర్కొన్నారు.

సుంకం 25 నుంచి 18 శాతానికి తగ్గింపు..

భారత్‌లో తయారైన వస్తువులపై పరస్పర సుంకాన్ని ప్రస్తుత 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే వాణిజ్య ఒప్పందానికి భారతదేశం, అమెరికా అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సోమవారం (ఫిబ్రవరి 2) ప్రధాని మోదీ(PM Modi)తో ఫోన్ సంభాషణ తర్వాత తెలిపారు.

"భారతదేశంలో తయారైన ఉత్పత్తులపై 18 శాతం సుంకం ఉంటుంది" అని ట్రంప్ చెప్పడం తనకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు.

"నా ప్రియ స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడటం చాలా బాగుంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం తగ్గిన సుంకం ఉందని తెలిసి సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని మోదీ అన్నారు.

రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు..అది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. "పరస్పర ప్రయోజనకర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది" అని ప్రధాని అన్నారు.

"ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా ముఖ్యమైనది. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారతదేశం పూర్తిగా మద్దతు ఇస్తుంది" అని ఆయన 'X'లో అన్నారు.

Read More
Next Story