జగన్ ను ఎదుర్కోవడంలో టీడీపీ ఎక్కడ విఫలమవుతోంది?
x

జగన్ ను ఎదుర్కోవడంలో టీడీపీ ఎక్కడ విఫలమవుతోంది?

దూకుడుగా వైసీపీ, ఆత్మరక్షణలో టీడీపీ, అయోమయంలో అమరావతి


ఆంధ్రప్రదేశ్ విడిపోయి పన్నెండేళ్లు గడిచాయి. ఒక తరం విద్యార్థులు పట్టభద్రులయ్యారు. వేల కోట్లు ఖర్చయ్యాయి, వందల సభలు జరిగాయి. కానీ, ఆంధ్రా పౌరుడికి ఇప్పటికీ "మన రాజధాని ఏది?" అంటే గట్టిగా సమాధానం చెప్పుకోలేని దుస్థితి. పార్లమెంటు చట్టం, కేంద్ర నిధులు, కోర్టు తీర్పుల తర్వాత ఇక 'అమరావతి' పనులు గాడిన పడతాయని ఆశించిన తరుణంలో, జగన్ విసిరిన 'మావిగన్' (MAVIGAN) బాంబు మళ్లీ చర్చను మొదటికి తెచ్చింది.

ఎవరి వాదన వారిదే!

రాజధాని రాష్ట్ర ఆత్మగౌరవం కావడానికి బదులు రాజకీయ పార్టీల అస్త్రంగా మారింది. నేతల చిత్తశుద్ధి ప్రశ్నార్థకమైన తరుణంలో వేలాది మంది రైతుల త్యాగం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలింది. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప అసలు పస కనిపించడం లేదు.

చంద్రబాబు: "అమరావతి అభివృద్ధే జగన్ విమర్శలకు అసలైన సమాధానం" అంటూ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు.
వైఎస్ జగన్: అమరావతిని 'ఘోస్ట్ క్యాపిటల్' (దయ్యాల నగరం) గా అభివర్ణిస్తూ, కేవలం 28 గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర సంపదనంతా తగలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పవన్ కల్యాణ్, వామపక్షాలు: అమరావతిని ఏకైక రాజధానిగా వేగంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నలిగిపోతున్న రాష్ట్ర భవిష్యత్తు

2014 నుంచి 2026 వరకు వింటున్న మాటలే ఇవి. ఈ మాటల యుద్ధంలో సామాన్యుడు చిత్తవుతున్నాడే తప్ప అడుగు ముందుకు పడలేదు. ఒకరు గ్రాఫిక్స్ చూపిస్తే, మరొకరు మూడు రాజధానులన్నారు, ఇప్పుడు కారిడార్ల ప్రతిపాదనలు తెచ్చారు.
రాజధానిపై స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే జంకుతున్నాయి. స్థిరమైన విధానం లేని చోట పెట్టుబడి పెట్టడానికి ఎవరూ సాహసించరు.

జగన్ వ్యూహం వ్యూహం ఏమిటీ?

జగన్ మోహన్ రెడ్డి తన వాదనను కేవలం రాజధాని మార్పుగానే కాకుండా, దాన్ని ఓ సామాజిక, ప్రాంతీయ వివక్షగా చిత్రీకరిస్తున్నారు. ఆయన ప్రసంగాల్లో తరచూ అమరావతిని "ధనికుల కోసం, ఒక సామాజిక వర్గం కోసం నిర్మిస్తున్న నగరం" అని పేర్కొంటారు. 'మావిగన్' (MAVIGAN) వంటి కొత్త ప్రతిపాదనలు తేవడం ద్వారా, అమరావతిపై ఖర్చు పెట్టే డబ్బును ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడుకోవచ్చనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

అమరావతిని ఓ వివాదంగా ఉంచడం వల్ల, ఇతర ప్రాంతాల ప్రజల్లో అమరావతి పట్ల ఓ విధమైన వ్యతిరేకతను పెంచి, దాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడం జగన్ ప్రధాన ఉద్దేశం అని టీడీపీ నేతలే- అచ్చెన్నాయుడు మొదలు ద్వితీయ శ్రేణి నాయకుల వరకు అందరూ ఆరోపిస్తున్నారు.

ఆత్మరక్షణలో పడిన టీడీపీ...

జగన్ వేస్తున్న ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన టీడీపీ నాయకత్వం తరచూ 'జగన్ పై వ్యక్తిగత విమర్శలు లేదా పాత రికార్డుల వైపు మళ్లుతోంది. జగన్ వాదన ఎలా తప్పో నిరూపించలేకపోతోంది' అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య ది ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.
జగన్ 'మావిగన్' అన్నప్పుడు, టీడీపీ నాయకులు గతంలో జగన్ అసెంబ్లీలో అమరావతిని అంగీకరించిన వీడియోలను, ఆయన గత కేసులను, వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తున్నారు. తమ అనుకూల వర్గాలతో జగన్ ను విమర్శించేలా చేస్తున్నారే తప్ప అమరావతి ఓ ఆర్థిక చోదక శక్తిగా ఎలా మారుస్తారో బలంగా వివరించలేకపోతున్నారు. "జగన్ గతంలో మాట తప్పారు, నిలకడలేని మనిషి" అని నిరూపించడానికే ఎక్కువ శక్తిని వృధా చేస్తున్నారు.

దీనివల్ల సామాన్య ప్రజలకు రాజధాని నిర్మాణంపై నమ్మకం కలగడం లేదు. టీడీపీ కేవలం ఆత్మరక్షణలో పడి, పాత గొడవలను తవ్వుతుండటంతో కొత్త తరం ఓటర్లకు రాజధాని అసలు ప్రయోజనాలు ఏమిటో అర్థం కావడం లేదు అని అమరావతి నివాసి టి.నరసింహారావు అన్నారు. ఈ అభిప్రాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.వి.వి. ప్రసాద్ కూడా సమర్థించారు.

పెరుగుతున్న ప్రాంతీయ విభేదాలు..

ఈ రెండు పార్టీల వైఖరి వల్ల రాష్ట్రంలో ప్రమాదకరమైన ధోరణులు కనిపిస్తున్నాయి. "మా ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుని అమరావతికి నిధులు ఇస్తారా?" అని రాయలసీమలో కొందరు, "రాజధాని కోసం భూములిస్తే మాకు అన్యాయం చేస్తారా?" అని కోస్తాలో మరికొందరు వాదించుకునే పరిస్థితి తలెత్తింది.
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వం రద్దు చేయడం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకురావడం వల్ల 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' అనే వ్యవస్థపైనే పెట్టుబడిదారులకు నమ్మకం పోతోంది.
అమరావతి అనేది కేవలం ఒక స్థలం కాదు, లక్షలాది మంది ఆశ. రాజధాని చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో అది ఒక మానని గాయంగా మిగిలిపోతోంది. ప్రతి ఎన్నికల సమయంలోనూ దీన్ని గెలకడం వల్ల రాష్ట్రం మొత్తం రెండు వర్గాలుగా విడిపోతోంది.
జగన్ ఈ వివాదాన్ని వచ్చే ఎన్నికల వరకు సజీవంగా ఉంచాలని చూస్తుంటే, టీడీపీ పాత అంశాలను తెరపైకి తెస్తూ రక్షణాత్మక ధోరణిలో వెళ్తోంది. ఈ రెండు పార్టీలను కాదని మూడో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు వీళ్లలో ఎవరో ఒకర్ని ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా సమస్య పరిష్కారం కాకపోగా రాష్ట్రాభివృద్ధి నానాటికీ వెనక్కి పోతోంది.

రైతుల అగమ్యగోచరం...

34 వేల ఎకరాల భూములిచ్చిన 29 వేల మంది రైతుల భవిష్యత్తు ఇప్పుడు ఒక 'భయం' కింద బతుకుతోంది. అభివృద్ధి ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు మొదలవుతుందో తెలియని సందిగ్ధత వారిని వెంటాడుతోంది.

కల నెరవేరేనా?

రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదు, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. జగన్ ఈ వివాదాన్ని వచ్చే ఎన్నికల వరకు సజీవంగా ఉంచాలని చూస్తుంటే, టీడీపీ పాత అంశాలతో రక్షణాత్మక ధోరణిలో వెళ్తోంది. ఈ రాజకీయ పంతాల వల్ల రాష్ట్రం నానాటికీ వెనక్కి పోతోంది.
రాజకీయ పార్టీలు తమ పంతాలను పక్కన పెట్టి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకపోతే... ఆంధ్రా రాజధాని కల ఒక నిరంతర నిరీక్షణగానే మిగిలిపోతుంది. అందుకే ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న ఒక్కటే.. "మీ రాజకీయ లబ్ధి కోసం రాజధానిని ఇంకెన్నాళ్లు బలిపశువును చేస్తారు?"
Read More
Next Story