11% అభివృద్ధి..2% ఆదాయం..ఇది ఎలా సాధ్యం?: బొత్స
x

11% అభివృద్ధి..2% ఆదాయం..ఇది ఎలా సాధ్యం?: బొత్స

ఏపీ ఆర్థిక మందగమనంపై బొత్స సంచలన ఆరోపణలు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఇప్పటి వరకు శాసనమండలి వేదికగా సాగిన అంకెల యుద్ధం తాజాగా కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి గణాంకాలకు, వాస్తవ ఆదాయానికి పొంతన లేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం 11.09% చొప్పున వేగంగా వృద్ధి చెందుతోందని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, పన్ను ఆదాయం మాత్రం కేవలం 1.97% వద్దే ఎందుకు ఆగిపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రపంచ ఆర్థికవేత్తలనే ఆశ్చర్యపరిచే కాకిలెక్క అని ట్విటర్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.

CAG నివేదికలతో పయ్యావులకు సవాల్
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఉద్దేశించి బొత్స ఘాటైన ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వానికి దొరకని CAG (Comptroller and Auditor General) నివేదికలను తానే స్వయంగా డౌన్‌లోడ్ చేసి ఇస్తున్నానంటూ 23 రాష్ట్రాలకు సంబంధించిన డేటాను బహిరంగంగా జతపరిచారు. రాష్ట్రం పరిస్థితి: పన్ను ఆదాయ వృద్ధిలో దేశంలోని 23 రాష్ట్రాలను పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో (చివరి నుండి రెండో స్థానం) ఉందన్న చేదు నిజాన్ని ఆయన గణాంకాలతో సహా బయటపెట్టారు.

కల్పిత వృద్ధి రేటు

ప్రభుత్వం కావలనే కల్పిత వృద్ధి చూపిస్తోందిని, ఆ కల్పిత వృద్ధి రేటుపై బొత్స పదునైన విమర్శలు చేశారు. గణాంకాల గారడీ అనీ అభివర్ణించారు. దేశ వృద్ధి రేటు 9.8% ఉంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం 11.75% వృద్ధి సాధిస్తోందని ప్రభుత్వం తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. ఆదాయం ఎక్కడ అని మండిపడ్డారు. అంత భారీ స్థాయిలో వృద్ధి ఉంటే, ఆ స్థాయిలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరగడం లేదు? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం పన్ను ఆదాయం 9.64% పెరిగిన తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ఆదాయం కేవలం 1.97% వద్దే నిలిచిపోవడం రాష్ట్ర ఆర్థిక మందగమనానికి నిదర్శనమని ఆరోపించారు.
ఆత్మపరిశీలన చేసుకోరా?
బాధ్యతాయుతమైన విపక్షంగా తాము వాస్తవాలను సభలో ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రిగా ఆత్మపరిశీలన చేసుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడటం దురదృష్టకరమని బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాను జతపరిచిన పత్రాలను పరిశీలించి, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం (SOTR) వృద్ధి రేటు 1.97% కంటే ఎక్కువగా ఉందని నిరూపించగలరా? అని మంత్రికి సవాల్ విసిరారు. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రజలను పక్కాగా తప్పుదోవ పట్టిస్తోందని భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read More
Next Story